వుహాన్ లో చిక్కుకున్న కర్నూల్ యువతి…!

post

చైనా లోని వుహాన్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడ చిక్కుకున్న మన భారతీయులను భారత విదేశాంగ శాఖ ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేసింది. అయితే, అక్కడ వారికీ విమానం ఎక్కించే ముందు వైద్య పరీక్ష జరిపి వైరస్ లేదని నిర్ధారించాక భారత్ కు పంపించారు. జ్వరం, జలుబు, ఇతర కరోనా లక్షణాలు ఉన్నవారిని అక్కడే ప్రత్యేక పరిరక్షణ లో ఉంచారు. వారిని మరో విమానం ద్వారా తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపధ్యం లో తనకి జ్వరం ఉందని తనను నిలిపివేశారంటూ కర్నూల్ కు చెందిన ఓ యువతి ఆవేదనతో తన తల్లికి పంపిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.
కర్నూలు ఈర్ణపాడుకు కు చెందిన శృతి అనే యువతి టిసిఎల్ ఉద్యోగ శిక్షణ కోసం చైనాలోని వుహాన్ కు వెళ్ళింది. కాగా, అక్కడ వైద్య పరీక్షల్లో తన శరీర ఉష్ణోగ్రత హెచ్చు గా ఉండడం తో ఆమెను, ఆమెతో పాటు మరో ఉద్యోగిని నిలిపివేశారు. దీనితో ఆమె తన తల్లికి వీడియో మెసేజ్ ను పంపింది. తనకు జ్వరం ఉన్న మాట వాస్తవమైనా, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడ గా ఉందని తెలిపింది. పనుల అలసట వల్లనే జ్వరం వచ్చిందని, తనకు కరోనా వైరస్ లక్షణాలు లేవని, అయినా ఇక్కడ చిక్కుకుపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీనితో ఆమె తల్లి తండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమెకు ఇటీవలే నిశ్చితార్థం అయిందని, ఈ నెల పదిహేడున ఆమెకు వివాహం జరగాల్సి ఉందని తెలిపారు. ఆమెను భారత్ కు తీసుకురావాల్సింది గా వేడుకుంటున్నారు.