రెండు విడతల్లో జీఎస్టీ బకాయిలు

post

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించిన అన్ని బకాయిలు రెండు విడతల్లో చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిల గురించి తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.జీఎస్టీ అమలు వల్ల ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి ఆయా రాష్ట్రాలకు రెండు నెలలకోసారి కేంద్రం పరిహారం చెల్లించాలని 2017 జీఎస్టీ చట్టం చెబుతోంది. 2017 జులై నుంచి రెండు నెలలకోసారి పరిహారం చెల్లిస్తూ వస్తున్నామని, గతేడాది సెప్టెంబర్‌ వరకు బకాయిలు విడుదల చేశామని అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అక్టోబర్‌- నవంబర్‌ నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. జీఎస్టీ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పరిహారం కింద రూ.2,10,969.49 కోట్లు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెల్లించినట్లు తెలిపారు.