9 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి

post

ఒక చిన్న ఇంటిని నిర్మించాలంటేనే కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. కానీ, చైనా మాత్రం 1000 పడకల ఆస్పత్రిని కేవలం తొమ్మిది రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించింది. భారీ నిర్మాణ, మౌలికవసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో చైనాది అందెవేసిన చెయ్యి. ఈ అనుభవం ఇలాంటి విపత్కర సమయంలో ఆ దేశానికి బాగా ఉపయోగపడింది. . జనాభా అధికంగా ఉండే చైనాలో విపత్తుల సమయంలో తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు.. ప్రమాదాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు చైనా ప్రభుత్వం ‘ప్రీ ఫ్రాబ్రికేటెడ్‌ కాంక్రీట్‌ బ్లాక్స్‌’ని సిద్ధంగా ఉంచుతుంది. వీటన్నింటినీ ఒకచోటికి చేర్చి నిర్మాణం పూర్తి చేస్తారు. అంటే విడిభాగాల్నింటినీ అనుసంధానం చేసి వాహనాన్ని రూపొదించినట్లే ఇళ్లను కూడా నిర్మిస్తారు. తాజాగా ఆస్పత్రి నిర్మాణంలోనూ ఇదే విధానాన్ని వినియోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న కాంక్రీట్‌ బ్లాక్స్‌ని వుహాన్‌కు చేర్చి ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక దీంట్లో ఆర్మీ భాగస్వామ్యంఉండడంతో పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అనుభవజ్ఞులైన ఇంజినీర్లందరినీ ఒక్కచోటికి చేర్చిన చైనా వారందరినీ ఈ ప్రాజెక్టులో భాగం చేసింది. మొత్తం 7000 మంది కార్మికులు 24X7 దీని నిర్మాణంలో పాల్గొన్నారు. 1000కి పైగా భారీ యంత్రాలు పనిచేశాయి. దీంతో 269000 చదరపు అడుగుల స్థలంలో ఆస్పత్రి సిద్ధమయింది. దీనిలో మొత్తం 30 ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లు(ఐసీయూ) సహా 419 వార్డులు ఉన్నాయి. మొత్తం 1400 మంది వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.