తెలంగాణః డేంజరస్‌గా మారిన తొమ్మిది నగరాలు.. అక్కడ గాలి పీలిస్తే అంతే!

post

ఇటీవల గ్రీన్‌పీస్ ఇండియా నిర్వహించిన సర్వేలో వాయు కాలుష్యంపై పలు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వాయు కాలుష్యం విపరీతంగా ఉందని స్పష్టమైంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని తొమ్మిది నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ నిర్దేశించిన పాయింట్లను ధాటి తీవ్ర స్థాయికి చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం ఈ స్థాయి తీవ్రతకు చేరుకోవడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.  ఇక దీని వల్ల ఈ నగరాల్లో నివసించే వారికి ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.

ఇదిలా ఉంటే భారతదేశంలోని సుమారు 287 నగరాల్లో వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుకుందన్న దానిపై ఆ సంస్థ సర్వే చేపట్టగా.. మొత్తం దేశవ్యాప్తంగా 231 నగరాలలో వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఇక అందులో తెలంగాణ నుంచి తొమ్మిది నగరాలు.. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు నగరాల్లో కాలుష్యం లెవెల్స్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. కాగా, ఈ లిస్టులో మిజోరాం చివరి స్థానంలో ఉంది.

తెలంగాణలో కొత్తూరు, హైదరాబాద్, రామగుండం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, పఠాన్‌చేరు, ఆదిలాబాద్‌లలో ఎక్కువగా వాయు కాలుష్యం ఉండగా.. నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు కొంచెం ఫర్వాలేదని నివేదిక చెబుతోంది.