సహకార ఎన్నికల్లో ఓట్ల తొలగింపు..!

post

తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) ఎన్నికల్లో లక్షలాది మంది రైతులకు ఓటు హక్కును తొలగించారు. మొత్తం 32.99 లక్షల మంది రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 42.38 శాతం మందికి ఓటు తొలగిస్తూ సంఘాల ఓటర్ల జాబితాలను ఖరారు చేశారు. ప్యాక్స్‌ లేదా సహకార బ్యాంకు నుంచి పంటరుణం తీసుకున్న రైతు ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఇలా చెల్లించని వారిని ‘డిఫాల్టర్‌’ కింద పరిగణించి ఓటు హక్కు తొలగించారు. ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు 2018 డిసెంబరు 11 వరకు రూ.లక్ష బాకీ ఉన్నవారికి మాఫీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ క్రమంలో రూ.లక్ష వరకు బాకీ ఉన్నవారు అప్పు కట్టకపోయినా ఓటు హక్కు కల్పించారు. రూ.లక్షకు మించి బాకీ ఉన్నవారితో పాటు సభ్యత్వ రుసుం బాకీ ఉన్నవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ప్రతీ సభ్యుడి ఫొటోతో సహా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు సహకార శాఖ గతంలో ప్రకటించింది. కానీ చాలా జాబితాల్లో ఫొటోలు రాలేదు. దీంతో ఫొటో లేకపోయినా ఓటు వేసే అవకాశం కల్పించాలని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి ఫొటోలను బ్యాలెట్‌ పత్రాలపై ముద్రించడం లేదని తెలుపుతూ మంగళవారం సహకార శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర సహకార శాఖ ఎన్నికల మండలి(సీఈఏ)ని వివరణ కోరగా గతంలో కొందరు బోగస్‌ ఓటర్లను చేర్పించారని అలాంటివారితో పాటు అప్పులు కట్టని వారికి, చనిపోయిన వారికి ఓటు హక్కు తొలగించినట్లు తెలిపింది.