జూలై 11 నుంచి గోల్కొండ బోనాలు...

post

తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండగలలో బోనాలు ఒకటి. నెల రోజుల పాటు వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలు జూలై 11 నుంచి మొదలుకానున్నాయి . కరోనా విస్తరణ నేపథ్యంలో గత సంవత్సరం ప్రజలను అనుమతించ కుండా ఆలయ కమిటీ సభ్యులే మాత్రమే ఉత్సవాలు జరిపించేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో ప్రజలకు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు మొదలు ప్రారంభించారు .  సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో బోనాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ బోనాలు ప్రారంభం అవుతాయి. అమావాస్య జూలై 10న వస్తుండడంతో 11 ఆదివారం నుంచి బోనాల జాతర మొదలుకానుంది. ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ, లాల్‌దర్వాజ మహంకాళి ఆలంయలో పూజలు జరుగుతాయి. తిరిగి కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది.