4 దేశాల సిరీస్‌ కోసం వేచి చూడాల్సిందే

post

మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక కొత్త ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా. టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో పాటు మరో టాప్‌ జట్టుతో ఏటా ఓ సూపర్‌ సిరీస్‌ నిర్వహించాలని భావించాడు. ఈ క్రమంలోనే డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదించాడు. అలాగే జనవరిలో క్రికెట్‌ ఆస్ట్రేలియాతో మాట్లాడాడు. అయితే, ఈ రెండు బోర్డులు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తెలియజేయనప్పటికీ బీసీసీఐ దీనిపై పాజిటివ్ గానే వుంది.వచ్చే ఏడాది నుంచి నిర్వహించాలని తలపెట్టిన సూపర్‌ సిరీస్‌ నిర్వహణపై ఆసీస్‌, ఇంగ్లాండ్‌ బోర్డులు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. ‘2021 నుంచి నాలుగు దేశాల సూపర్‌ సిరీస్‌ నిర్వహించాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంపై ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా బోర్డులతో చర్చించాం. అయితే, ఈ సిరీస్‌ నిర్వహించడానికి ముందు కొన్ని సమస్యలు, అడ్డంకులు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాతే సూపర్‌ సిరీస్‌కు సంబంధించిన తర్వాతి కార్యాచరణను ప్రారంభించాల్సి ఉంది. అందుకోసం ఇంకాస్త సమయం వేచి చూడాలి’ అని ఆయన వివరించారు.