'థ్యాంక్ యు బ్రదర్' సినిమా రివ్యూ...

post

కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో కొత్త సినిమాల విడుదల దాదాపుగా వాయిదా పడుతున్నాయి . చాలా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేశారు. చిత్ర నిర్మాతలు సైతం తమ సినిమాల విడుదలను వాయిదా వేశారు. ఏప్రిల్ చివరి వారంలో థియేట్రికల్ విడుదల కావాల్సిన సినిమాలలో 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా ఒకటి. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ బొమ్మారెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఈరోజు (మే 7)న ఆహా లో స్ట్రీమింగ్ చేశారు. అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అర్చనా అనంత్ ప్రధాన పాత్రలలో నటించిన 'థ్యాంక్ యు బ్రదర్' ఎలా ఉందో చూద్దాం .... 

అభి (విరాజ్ అశ్విన్) బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. భర్త మరణంతో అభి తల్లి భాను (అర్చనా అనంత్), డాక్టర్ ప్రేమ్ (అనీష్‌ కురువిల్లా)ను వివాహం చేసుకుంటుంది. అది అభికి నచ్చదు. దాంతో తల్లితో ఎడముఖం పెడముఖంగా ఉంటాడు. ఫెండ్స్ తో తాగి తందనాలు ఆడటం, నచ్చిన అమ్మాయితో గడిపేయడం అతని అలవాటుగా మారిపోతుంది. అతనికి సమీర (మోనికా రెడ్డి) అనే ప్రియురాలూ ఉంటుంది. విపరీతమైన యాటిట్యూడ్ ప్రదర్శించే అభిని ఎలా దారికి తీసుకురావాలో అతని తల్లికి అర్థం కాకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ లేడీ ప్రియ (అనసూయ భరద్వాజ్)తో కలిసి అభి అనుకోకుండా ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోతాడు. అది కాస్త చెడిపోయి మధ్యలో ఆగిపోతుంది. ఇంతలో ఆమెకు లేబర్ పెయిన్స్ మొదలవుతాయి... ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కధ.

ఓ చిన్న పాయింట్ ను తీసుకుని గంటన్నర చిత్రంగా మలచడం ఎవరికైనా కత్తిమీద సామే. పైగా దర్శకుడు రమేశ్‌ రాపర్తి పక్కదారి పట్టకుండా తాను రాసుకున్న కథను స్ట్రయిట్ ఫార్వర్డ్ గా తెరకెక్కించాడు. ప్రథమార్ధం అంతా అభి యాటిట్యూడ్ ను రిజిస్టర్ చేయడానికి కేటాయించిన దర్శకుడు ద్వితీయార్థంలో అతనిలో పరివర్తన ఎలా జరిగిందో చూపించాడు. అందుకోసం ప్రెగ్నెంట్ లేడీ ఎపిసోడ్ ను ఆయుధంగా మలుచుకున్నాడు. మాతృత్వంలోని మధురిమలను గురించి అందరూ అందంగా చెబుతారు. కానీ లేబర్ పెయిన్స్ ను తట్టుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళకు మరో జన్మ ఎత్తడం వంటిదే. ఈ విషయాన్ని ముఖ్యంగా మగపిల్లలు గుర్తిస్తే, అమ్మతనంపట్ల, మహిళల పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. తల్లిని పట్టించుకోని ఓ కుర్రాడు... తప్పని పరిస్థితుల్లో ఓ తెలియని మహిళకు డెలివరీ చేయాల్సి వస్తే.. ఎంత మానసిక క్షోభను అనుభవించాడు, తద్వారా అతని ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు వచ్చిందనే విషయాన్ని దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో జరిగిన కథగా దీనిని చూపించడంతో ఇవాళ్టి రోజున, మన కళ్ళముందు జరిగిన కథగా ఆడియెన్స్ ఫీల్ అవుతారు. ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా... దానిని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో యాటిట్యూడ్ ను చూపించే సన్నివేశాలు చాలా కృతకంగా ఉన్నాయి. అలానే అతనిలో మార్పు సైతం ఒకే ఘటనతో వచ్చినట్టు చూపించాడు. ఇక ఓ కుర్రాడు మహిళకు డెలివరీ చేయడం అనే పాయింట్ ను మనం 'త్రీ ఇడియట్స్' మూవీలో ఇప్పటికే చూశాం. ఇందులోని సన్నివేశాలు చూస్తుంటే... అవే మనకు గుర్తొస్తాయి. ఈ ఎమోషనల్ సీన్స్ ను ఇంకాస్తంత భిన్నంగా, ఆసక్తికరంగా తెరకెక్కించాల్సింది.

నటీనటుల విషయానికి వస్తే.. యాటిట్యూడ్ ఉన్న కుర్రాడిగా విరాజ్ అశ్విన్ బాగా నటించాడు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ మేనల్లుడు విరాజ్ గతంలో 'అనగనగా ఓ ప్రేమకథ' చిత్రంలో హీరోగా చేశాడు. ఇది అతనికి మూడో సినిమా. విరాజ్ రెండో చిత్రం 'వాళ్ళిద్దరి మధ్య' విడుదల కావాల్సి ఉంది. అనసూయ సినిమా ద్వితీయార్ధాన్ని తన భుజస్కందాలపై మోసింది. 'క్షణం', 'రంగస్థలం' చిత్రాల తర్వాత మళ్ళీ అంత చక్కని నటనను ప్రదర్శించింది. విరాజ్ తల్లిగా 'కార్తీక్ దీపం' ఫేమ్ అర్చనా అనంత్ నటించారు. వెండితెరపై కూడా తన గ్రేస్ ను అంతే చక్కగా ప్రెజెంట్ చేసింది అర్చనా. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు మరో తల్లి పాత్రధారిణి దొరికిందని అనుకోవచ్చు. ఇక ఇతర ప్రధాన పాత్రలను అనీశ్ కురువిల్ల, అన్నపూర్ణ, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, హర్ష, రాఘవేంద్ర రాజ్, అలేఖ్య, జయశ్రీ రాచకొండ, కాదంబరి కిరణ్, సమీర్ తదితరులు పోషించారు. వీరి నుండి దర్శకుడు చక్కని నటనే రాబట్టుకున్నాడు.

దర్శకుడు రమేశ్ తో కలిసి సాయి సురేంద్ర బాబు రాసిన మాటలు అర్థవంతంగా, పాత్రోచితంగా ఉన్నాయి. గుణ బాలసుబ్రహణ్యన్ నేపథ్య సంగీతం చెవులకు ఇంపుగా ఉంది. ఇందులో ఉన్నది ఒక నేపథ్య గీతమే అయినా హాయిగా హృదయానికి హత్తుకునేలా సాగింది. సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మరో హైలైట్. తెర మీద మనకు కనిపించే ప్రతి ప్రధాన పాత్రకు చక్కని ముగింపును దర్శకుడు ఇవ్వడం బాగుంది. నైజీరియన్ మూవీ 'ఎలివేటర్ బేబీ' స్ఫూర్తితో రూపుదిద్దుకున్న 'థ్యాంక్ యు బ్రదర్' కథను మరింత విస్తారంగా రాసుకుని, మరింత మందికి నచ్చేలా దర్శకుడు చేసి ఉంటే బాగుండేది. థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కానీ, ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి వీకెండ్ లో హ్యాపీగా చూసేయొచ్చు. ప్రేక్షకుల సహనానికి మరీ పరీక్ష పెట్టకుండా దీనిని 94 నిమిషాలకే కుదించి మంచి పనిచేశారు. ఓ పూర్తి స్థాయి సినిమా చూసిన అనుభూతి కంటే... మూడు ఎపిసోడ్స్ ఆంథాలజీని చూసిన భావన కలిగిస్తుంది. మూవీ పూర్తి అయిన తర్వాత ఇలాంటి కథను ఎంచుకున్న అనసూయ గట్స్ కు, ఆమె అభినయానికి అభినందనలు చెప్పాలనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేసిన డైరెక్టర్ రమేశ్ తో 'థ్యాంక్ యు బ్రదర్' అనాలనిపిస్తుంది!!