అనుకోని అతిథి రివ్యూ....

post

పోయిన సంవత్సరం నవంబర్ లో కన్నడ చిత్రం ‘కారాళరాత్రి’కి తెలుగు రీమేక్ అయిన ‘అనగనగా ఓ అతిథి’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మర్డర్ మిస్టరీని ఇంకా జనం మర్చిపోకముందే. తాజాగా ఆహాలోనే మలయాళ చిత్రం ‘అథిరన్’ను ‘అనుకోని అతిథి’గా డబ్ చేసి ఈరోజు స్ట్రీమింగ్ చేశారు. ఫహద్ ఫాజిల్, సాయిపల్లవి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం ... 

ఇది 1972లో జరిగే కథ. దానికి ఐదేళ్ళ ముందు చల్లపల్లి సంస్థానంలోని రాజకుటుంబంలో నాలుగు హత్యలు జరుగుతాయి. ఆ సంస్థానపు వారసురాలు నిత్య (సాయిపల్లవి) ఆటిజమ్ తో బాధపడుతుంది. ఆ హత్యలు ఆమే చేసిందని అంతా భావిస్తుంటారు. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో మానసిక వైద్యశాలలో గోవాకు చెందిన డాక్టర్ బెంజిమిన్ (అతుల్ కులకర్ణి) పనిచేస్తుంటాడు. నిత్య తన కూతురే అని ఆయన అక్కడి వాళ్ళకు చెబుతుంటాడు. అయితే. ఆ మానసిక వైద్యశాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానంతో తిరువనంతపురం నుండి ప్రభుత్వం డాకర్ట్ నంద అనే సైకియాట్రిస్టు (ఫహద్ ఫాజిల్)ను అక్కడికి పంపుతుంది. అతని పరిశోధనలో ఏం తేలింది? తన కుటుంబ సభ్యులను నిత్యే చంపిందా? నిజంగానే ఆ మానసిక వైద్యశాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనేది ఈ సినిమా కథ.

2019లో మలయాళ సినిమా ‘అథిరన్’ విడుదలై అక్కడ మిశ్రమ స్పందన లభించింది. 2014లో వచ్చిన ఓ అమెరికన్  సినిమా దీనికి ఆధారం. ఈ తరహా సైకిలాజికల్ థ్రిల్లర్స్ గతంలో చాలానే వచ్చాయి. అయితే దర్శకుడు వివేక్ ఆసక్తికరంగానే ఈ కథను నడిపించాడు. కేరళ అందాలతో పాటు. పురాతన భవంతి, అక్కడి సెలయేర్లు, పచ్చటి బయళ్ళు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చకచకా సాగిపోతుంది. ఇక నటీనటులు సైతం అనుభవం ఉన్నవాళ్ళు కావడంతో ఆ యా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మరీ ముఖ్యంగా డాక్టర్ నంద పాత్రలో ఫహద్ ఫాజిల్, ఆటిజమ్ పేషెంట్, కలరీ యుద్ధ నిపుణురాలిగా సాయి పల్లవి. ఇద్దరూ పోటీపడి నటించారు. సాయిపల్లవి పాత్రకైతే సంభాషణలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక అతుల్ కులకర్ణి డాక్టర్ బెంజిమెన్ పాత్రను హుందాగా పోషించాడు. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ చివరిలో అతిథి పాత్రలో మెరిశాడు. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వాళ్ళు. మనకు పరిచయస్థులు కాకపోయినా. అలా అనిపించదు. ఎందుకంటే అక్కడ పాత్రలే మనకు కనిపిస్తాయి. లీనా, సుదేవ్ నాయర్, రెంజీ ఫణిక్కర్, శాంతికృష్ణ, నందు, సురభి లక్ష్మి, విజయ్ మీనన్ ఆయా పాత్రలో చక్కగా ఒదిగిపోయారు.

ఓవర్ ఆల్ గా సినిమాను చూసినప్పుడు కొన్ని లూజ్ ఎండ్స్ కనిపిస్తాయి. హీరోయిన్ మేనత్త ఎలా మరణించిందో దర్శకుడు మనకు చూపడు. అలానే సంస్థానంలోని అన్నదమ్ముల మధ్య పగ, ప్రతీకారాలకు బలమైన కారణాలూ చెప్పడు. కొన్ని పాత్రలు తెర మీదకు ఎందుకు వచ్చి, ఎందుకు నిష్క్రమిస్తాయో అర్థం కాదు. పని కట్టుకుని ఆ గ్రామానికి పేపర్ తెప్పించుకునే డాక్టర్ బెంజిమన్ దానిని చదవకపోవడం కూడా దర్శకుడు చేసిన పొరపాటుగానే భావించాలి. అయితే. డాక్టర్ నంద జరిపే ఇన్వెస్టిగేషన్ లో లీనమైపోయిన వీక్షకుడికి ఇవేవీ పెద్దంత పట్టవు. అందుకు జిబ్రాన్ నేపథ్య సంగీతంతో పాటు, అను మోతేదత్ సినిమాటోగ్రఫీ కూడా ఉపయోగపడింది. ఇక జయహరి స్వరపరిచిన స్వరాలు, వాటికి చరణ్‌ అర్జున్‌, మధు పమిడికాల్వ సమకూర్చిన సాహిత్యం అర్థవంతంగా ఉన్నాయి. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎం. రాజశేఖర్ రెడ్డి రాసిన మాటలు చక్కగా ఉన్నాయి.

నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ‘అనుకోని అతిథి’ గత యేడాది నవంబర్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. చివరకు ఆహా ఓటీటీలో దీనిని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ సిద్ధపడ్డారు. కానీ బాధాకరం ఏమంటే. ఇటీవలే ఆయన వైజాగ్ లో గుండెపోటుతో కన్నుమూశారు. గతంలో హీరో తరుణ్ తో కృష్ణకుమార్ ‘సఖియా’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. బహుశా ఆ అనుబంధంతోనే కావచ్చు. ఇందులోని ఫహద్ ఫాజిల్ కు తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పించారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి కానీ రెండు మూడు చోట్ల మనకు మలయాళ రాత కనిపిస్తుంది. వాటిని పరిహరించి ఉంటే బాగుండేది.

ఓటీటీల పుణ్యమా అని ఇప్పుడు మలయాళ సినిమాల డబ్బింగ్ వర్షన్స్ ను మనం బాగానే చూడగలుగుతున్నాం. ఇక కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అవుతున్నాయి. వాళ్ళు ఎంచుకునే కథల్లోని కొత్తదనం మన వాళ్ళను ఆకట్టుకుంటోందని, ఆ చిత్రాలకు లభిస్తున్న ఆదరణ బట్టి అర్థమౌతోంది. థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ‘అనుకోని అతిథి’ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ‘అంతకు మించి’ అని పెట్టారు. అదేమిటో సినిమా చివరి వరకూ చూస్తే మీకే అర్థమౌతుంది.