ఫ్యామిలీ మ్యాన్ -2(వెబ్ సీరిస్) రివ్యూ..... 

post

మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగానే ఇందులోని కథాంశం విషయంలో జరిగిన చర్చ, ఫలితంగా రాజుకున్న వివాదం కారణంగా అసలు ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ ఈరోజు (శుక్రవారం) అర్థరాత్రికి కాస్తంత ముందుగానే దీనిని స్ట్రీమింగ్ చేసేసింది. అయితే. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను చూసిన తర్వాత మాత్రం తమిళుల సంస్కృతి సంప్రదాయాలకు మేకర్స్ రాజ్ అండ్ డీకే ఎలాంటి విఘాతం కలిగించలేదని, జరిగిన చరిత్రను తెలిపే క్రమంలో వీలైనంత వరకూ సున్నితమైన అంశాలను అంతే సున్నితంగా డీల్ చేశారనేది వీక్షకులకు అర్థమౌతుంది.
మొదటి సీజన్ లో కాశ్మీర్ లో పాగా వేసిన పాక్ టెర్రరిస్టులను మట్టుబెట్టడాన్ని ప్రధానాంశంగా ఎంచుకున్న దర్శకులు ఈసారి తమ దృష్టిని దక్షిణ భారతానికి మరల్చారు. శ్రీలంకలోని తమిళ రెబల్స్ శిక్షణా శిబిరం బ్లాస్ట్ తో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. శ్రీలంకలో శాంతిని కాపాడటం కోసం భారత చూపిన చొరవ, అయితే దానిని అక్కడి తీవ్రవాదులు మరో రకంగా అర్థం చేసుకోవడం, ఫలితంగా భారత్ పై కక్ష పెంచుకోవడం అనేది ఓ చరిత్ర. ఈ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుంటూనే, ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు ముడిపెడుతూ కథను రాసుకున్నారు. శ్రీలంకను చైనాకు దగ్గరగా చేయకుండా ఉండటం కోసం భారత్ కొన్ని సందర్భాలలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందనేది ఇందులో చూపారు. నిజానికి ప్రపంచ వాణిజ్యానికి, ప్రపంచ దేశాల మధ్య ఉన్న పైకి కనిపించని పోరుకు జలమార్గాలు ఎంతో కీలకం. ఆ మార్గాలపై పట్టు బిగించాలన్నది భారత్ లక్ష్యం. ఇదే అంశం ఈ సీజన్ లో అంతర్లీనంగా కనిపిస్తుంది. అందుకోసం మనదేశంలో ఉన్న శ్రీలంక రెబల్ లీడర్ భాస్కరన్ సోదరుడు సుబ్బును ఆ దేశానికి అందించడానికి సిద్ధ పడుతుంది. కానీ ఊహించని విధంగా జరిగిన బాంబు బ్లాస్ట్ లో సబ్బు చనిపోతాడు. సోదరుడిని కోల్పోయిన భాస్కరన్ ఏం చేశాడు? శ్రీలంకకు స్నేహహస్తం ఇవ్వాలనుకున్న భారత్ ఎలాంటి ఇబ్బందులకు గురైంది? ఈ దేశ ప్రధాని, ఆ దేశ రాష్ట్రపతి సమావేశం సజావుగా సాగిందా? చెన్నయ్ లో స్లీపర్ సెల్స్ గా ఉన్న శ్రీలంక తమిళులు తాజా పరిణామాలపై ఎలా స్పందించారు? రకరకాల సమస్యల నడుమ టాస్క్ కు చెందిన శ్రీకాంత్ తివారి, జెకె తమ టార్గెట్ ను ఎలా ఛేదించారు? అనేదే ఈ తొమ్మిది ఎపిసోడ్స్ వెబ్ సీరిస్ కథ, కమామీషు.

పేరుకు తగ్గట్టుగానే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ సీజన్ 2లోనూ శ్రీకాంత్ తివారి జీవితం చుట్టూనే కథను నడిపారు దర్శకులు. మొదటి సీజన్ చివరిలో జరిగిన కెమికల్ ఫ్యాక్టరీ గ్లాస్ లీక్, దాని కారణంగా దాదాపు యాభై మంది చనిపోవడంతో ఖిన్నుడైన శ్రీకాంత్ తివారి. టాస్క్ నుండి బయటకు వచ్చేయడం జరుగుతుంది. అలానే భార్య కోరిక మేరకు ఇద్దరు పిల్లలతో మరింత సమయం గడపడం కోసం కార్పొరేట్ కంపెనీలో నైన్ టు ఫైవ్ జాబ్ కు కుదురుకుంటాడు. ఈ ఐటీ జాబ్ లో ఇమడలేక, కుటుంబ సభ్యులనూ హ్యాపీగా ఉంచలేక మానసికం శ్రీకాంత్ తివారి సతమతమవడం.. చివరకు మనసు మార్చుకుని టాస్క్ లో చేరడం. ఈ సంఘటనలన్నీ సరదాగా సాగిపోయాయి. అయితే. ఈ సీజన్ లో శ్రీకాంత్ తివారిని నిలవరించడం కోసం అతని కూతురు ధృతీని అరి వర్గాలు పావుగా వాడుకోవడం ఓ ఊహించని మలుపు.

ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పట్ల అందరూ అదనపు ఆసక్తిని కనబర్చడానికి అసలు సిసలు కారణం సమంత. తొలిసారి ఆమె దీనితోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టింది. నిజానికి దీనికి ముందే ఆహాలో సామ్ జామ్ కార్యక్రమం చేసినా. వ్యాఖ్యాతగా వ్యవహరించడం వేరు. ఓ వెబ్ సీరిస్ లో ప్రధాన పాత్ర పోషించడం వేరు! శ్రీలంక తమిళ విప్లవకారిణి రాజీగా సమంత ఆ పాత్రకు ప్రాణం పెట్టిందనే చెప్పాలి. ఆమె పాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎక్స్ ప్రెషన్స్ లో పెద్దంత వేరియేషన్స్ లేవు. కాకపోతే కళ్ళతోనే చాలా వరకూ తన భావాలను ప్రకటించే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా ఆరో ఎపిసోడ్ లో సమంతపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు వెబ్ సీరిస్ కు హైలైట్ అని చెప్పాలి. సెకండ్ ఎపిసోడ్ లో కాటన్ మిల్ కార్మికురాలిగా వీక్షకుల ముందుకు వచ్చే సమంత. లైంగిక వేదింపులను మౌనరోదనతో భరించడం, చివరకు అవతలి వారికి తగిన బుద్ధి చెప్పడం, ఆ క్రమంలో పోలీసులను తప్పించుకోవడానికి పడే పాట్లు. ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. సమంత పాత్ర పోషణలో ఎలాంటి సినిమాటిక్ పోకడలకు పోకుండా ఆమెలోని వేదనను సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది అభినందించదగ్గది. ఇక శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్ పాయ్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ప్రియమణిని మొదటి సీజన్ తో పోల్చితే. ఇందులో అంతగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇక భారత ప్రధాని బసు పాత్రను సీమా బిస్వాస్ తో చేయించడం బాగుంది. కాకపోతే. ఆమె గెటప్ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీని తలపించింది. భారత్ కాబోయే ప్రధాని ఆవిడే కావచ్చునని రాజ్ అండ్ డీకే చెప్పకనే చెబుతున్నారనిపించింది. ఇక ఇతర ప్రధాన పాత్రల్లో మైమ్ గోపీ, అళగమ్ పెరుమాళ్, షరీబ్ హష్మీ, ఆశ్లీష ధాకూర్, దలిప్ తహిల్, పవన్ చోప్రా, ఆనంద్ సమి తదితరులు పోషించారు.

వెబ్ సీరిస్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం. తర్వాతి ఎపిసోడ్ లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవడం. ఈ మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ లో మధ్య మధ్యలో కథాగమనం కాస్తంత నెమ్మదించినా. ప్రతి ఎపిసోడ్ ముగింపు. తర్వాత ఏం జరిగిందనే ఉత్సుకతను కలిగించింది. దాంతో ఏకబిగిన తొమ్మిది ఎపిసోడ్స్ ను చూసేలా చేసింది. సీజన్ 1ను అర్థాంతరంగా ముగించిన మేకర్స్. ఈ సీజన్ కు మాత్రం చక్కని ఎండింగ్ ఇచ్చారు. అదే సమయంలో సీజన్ 3 కూడా ఉంటుందనీ తెలిపారు. మరి అది ఎప్పుడు, ఎలా వీక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. ఓవర్ ఆల్ గా చెప్పుకుంటే. ఈ సీజన్ మేకర్స్ రాజ్,డీకే అండ్ సుపర్ణ వర్మ కృషి ఫలించిందనే చెప్పాలి