‘మిస్ ఇండియా’

post

నటీనటులు: కీర్తి సురేష్-నవీన్ చంద్ర-జగపతిబాబు-నదియా-నరేష్-రాజేంద్ర ప్రసాద్-కమల్ కామరాజు-సుమంత్ శైలేంద్ర-పూజిత పొన్నాడ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్
నిర్మాత: మహేష్ కోనేరు
రచన: నరేంద్రనాథ్-తరుణ్ కుమార్
దర్శకత్వం: నరేంద్రనాథ్

‘మహానటి’తో నటిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసింది కీర్తి సురేష్. దాని తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అందులో ఒకటైన ‘పెంగ్విన్’ కొన్ని నెలల కిందటే వచ్చింది. వెళ్లింది. ఇప్పుడు అదే కోవలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మిస్ ఇండియా’. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా అయినా కీర్తి స్థాయికి తగ్గట్లు ఉందో లేదో చూద్దాం పదండి.

కథ: మానస సంయుక్త (కీర్తి సురేష్) విశాఖపట్నంలోని లంబసింగి ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి. తాను పెద్దయ్యాక ఎంబీఏ చదివి బిజినెస్ చేయాలని చిన్నతనంలోనే ఒక లక్ష్యం పెట్టుకుంటుంది. ఆమె తాతయ్య (రాజేంద్ర ప్రసాద్) తనకు ప్రోత్సాహంగా నిలుస్తాడు. కానీ పెరిగి పెద్దయ్యాక మాత్రం మిగతా కుటుంబ సభ్యులెవరూ ఆమెకు అండగా నిలవరు. తాత చనిపోవడం అన్నయ్యకు ఉద్యోగం రావడంతో అయిష్టంగానే అమెరికాకు వెళ్తుంది సంయుక్త. అక్కడ చదువు పూర్తయ్యాక వ్యాపార ప్రణాళికల్లో ఉన్న ఆమెకు ఎవరి నుంచీ సహకారం అందదు. చివరికి అందరినీ విడిచిపెట్టి.. ఒక్కత్తే తన లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలవుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి.. వాటిని ఎలా అధిగమించింది.. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మన హీరోయిన్ గారికి టీ అంటే మహా ఇష్టం. ఎంతిష్టం అంటే.. ఆమెకు జబ్బు చేస్తే మాత్ర వేసుకోదు. టీనే తాగుతుంది. తర్వాత హీరోయిన్ అమెరికాకు వెళ్లి అక్కడ టీ దొరకలేదని విలవిలలాడిపోతుంది. ఒక అబ్బాయితో డిన్నర్ కు వెళ్లి ఫుల్లుగా బువ్వ తిన్నాక కూడా మళ్లీ టీనే అడుగుతుంది. వ్యాపారం చేయాలన్న తన ఆలోచనను ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోలేదని బయటికి వచ్చేశాక ఆమెకు అప్పుడు కూడా టీనే గుర్తుకొస్తుంది. పెద్ద రేంజిలో టీ వ్యాపారం చేసెయ్యాలని ఫిక్సయిపోతుంది. అందుకోసం ఒక పెద్ద కాఫీ బ్రాండును నడిపించే మల్టీ మిలియనీర్ ను కలుస్తుంది. అతను కాదంటే సవాలు చేస్తుంది. సొంతంగా టీ బిజినెస్ పెట్టేస్తుంది. ఆమె ధాటికి వేల కోట్ల అధిపతి అయిన కాఫీ బ్రాండోడు కుప్పకూలిపోతాడు. అమెరికన్లందరూ డ్రగ్స్ కు బానిసలైపోయినట్లు మనమ్మాయి గారి టీ మత్తులో పడి కొట్టుకుంటారు. ఒకట్రెండు సార్లు టీ తాగిన పుణ్యానికి ఆమె టీ బిజినెస్ ప్రమాదంలో ఉందంటే నోట్ల కట్టలు పట్టుకుని ఆమె షాపులోకి పొలోమని వచ్చేస్తారు. ఆన్ లైన్లోనూ డాలర్లు కుమ్మరించేస్తారు. అంతా చదువుతుంటే.. ‘ఏమిటి ఈ టీ గోల’ అనిపిస్తోందా? నాలుగు వాక్యాలు చదువుతున్నందుకే అంత అసహనం కలిగితే.. తెరపై రెండుంబావు గంటల పాటు ఈ ‘టీ’ గోలను భరించే వాళ్ల పరిస్థితేంటో ఊహించుకోండి.