'రంగ్ దే' మూవీ రివ్యూ.... 

post

ఈ సంవత్సరం హీరో  నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . అందులో ఒకటి 'చెక్'సినిమా కాగా ,మరొకటి ఈ శుక్రవారం విడుదలైన 'రంగ్ దే' సినిమా . వాస్తవానికి ఈ రెండు సినిమాలు గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం బ్యాక్-టు-బ్యాక్ విడుదలయ్యాయి.  'చెక్' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద  అంచనాలకు తగ్గట్టుగా ఆడకపోవడంతో నితిన్ తన ఆశలన్నింటినీ 'రంగ్ దే'పై ఉంచాడు. ఇప్పుడు 'రంగ్ దే'  ఎలా ఉందొ తెలుసుకుందాం.
అర్జున్ , అను (నితిన్, కీర్తి సురేష్) చిన్ననాటి స్నేహితులు. పక్క పక్క ఇళ్ళలోనే ఉంటూ కలిసి  చదువుకుంటారు. ప్రతిదానిలో తనకన్నా ఎక్కువ చురుకుగా ఉండే అను అంటే చిన్నప్పటి నుంచీ అర్జున్ కు కాస్త ఈర్ష్య. అర్జున్ ఆమెకు  నుండి దూరం గా పోవాలనుకుంటే ... ఆమె మాత్రం అతనితోనే తన జీవితమంతా గడపాలని కోరుకుంటుంది . అనుకోకుండా, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు.ఇష్టంలేకుండా తన మెడలో తాళికట్టిన అర్జున్ మనసును ఆమె ఎలా గెలుచుకుంది? అను పై అపార్థాలు తొలగిపోయిన తర్వాత అర్జున్ ఆమెకు తన హృదయంలో ఎలాంటి స్థానం కల్పించాడు అనేది మిగతా కథ.
ఒక అబ్బాయి, అమ్మాయి ... వారి మధ్య మొలకెత్తిన ప్రేమ, అపార్థాలతో విడిపోవాలని అనుకోవడం, తిరిగికలుసుకోవడం ... ఈ సందర్భంలో చాలా కథలు వచ్చాయి. సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదలుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా 'నువ్వే కావాలి, ఆనందం' వంటి చిత్రాలలోని పాత్రలే తెర మీదకు మళ్ళీ వచ్చాయా అనిపిస్తుంది కూడా! అయితే... ఫస్ట్ హాఫ్ చివరిలో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళి చేసుకున్న హీరోహీరోయిన్లు, ఆపైన దుబాయ్ చేరిన తర్వాత సాగే కథను దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికరంగా మలిచాడు. భార్యాభర్తల అనుబంధాన్ని హీరో అక్క, బావల కథతో మిళితం చేసి ప్రేక్షకులను సైతం కన్వెన్స్ చేశాడు. అలానే అను కు అర్జున్ పట్ల ఉన్నది కేవలం ఇష్టం మాత్రమే కాదు ప్రేమ అనే విషయాన్ని కూడా చక్కగా చూపించాడు. మొత్తం మీద సినిమా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ముగిసింది.
'చెక్' సినిమాలో కాస్తంత డీలాగా కనిపించిన నితిన్... ఇందులో మాత్రం పూర్తి ఎనర్జీతో కనిపించాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ క్యూట్ గా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అలానే కీర్తి సురేశ్ గత రెండు చిత్రాలు 'పెంగ్విన్, మిస్ ఇండియా' ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. మళ్ళీ ఈ మూవీతో కీర్తి ఫామ్ లోకి వచ్చేసినట్టు అనిపించింది. 'మహానటి' ముందు మనం చూసిన బబ్లీ గర్ల్ ను ఇందులో మరోసారి చూసే అవకాశం దక్కింది. నాటీ క్యారెక్టర్ ను నితిన్ తో పోటీ పడుతూ చేసింది. ఇక హీరో తల్లిదండ్రులుగా కౌసల్య, నరేశ్; అతని అక్క, బావగా గాయత్రి రఘురామ్, వినీత్ నటించారు. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరినీ తెలుగు తెరమీద చూసినట్టు అయ్యింది. ఇక కీర్తి తల్లి పాత్రలో రోహిణి చక్కగా ఒదిగిపోయింది. హీరో వెన్నంటి ఉండే స్నేహితులుగా సుహాస్, అభినవ్ గోమటం చక్కని హాస్యాన్ని పండించారు. అలానే 'సత్యం' రాజేశ్, బ్రహ్మాజీతో పాటు ముఖ్యంగా సినిమా ద్వితీయార్థంలో వెన్నెల కిశోర్ తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో బోలెడంత రిలీఫ్ ను అందించాడు. నిజానికి ప్రథమార్ధంలో పెద్దంత కథేమీ జరగదు, ద్వితీయార్థంలోనే సినిమా పేరుకు తగ్గట్టుగా రంగుల హరివిల్లును తలపించే భావోద్వేగాలు చోటు చేసుకుంటాయి. అయితే... వాటిని కూడా దర్శకుడు ఎక్కడా మరీ లాగకుండా... లోతుకు పోకుండా పైపైన తీసేశాడు. దాంతో సినిమా చూస్తున్నంతసేపు బోర్ కొట్టకుండా బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత ఆలోచిస్తే... చెప్పుకోదగ్గ గొప్ప అంశాలేవీ లేవు కదా! అనిపిస్తుంది. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఈ సినిమాలో మాటలు, శ్రీమణి రాసిన పాటలు బాగున్నాయి. తన తొలి రెండు చిత్రాలకు ఎస్.ఎస్. తమన్ తో సంగీతం చేయించుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు. దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో రెండు బాగానే ఉన్నాయి. మిగిలినవి గొప్పగా లేవు. సాంకేతిక నిపుణుల్లో చెప్పుకోవాల్సింది పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి, ముఖ్యంగా హీరోహీరోయిన్ల రొమాంటిక్ సీన్స్ లో క్లోజప్ షాట్స్ సూపర్. ఇక ఇటీవలే బెస్ట్ ఎడిటర్ గా జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైన నవీన్ నూలి ఈ మూవీకి వర్క్ చేశాడు. అతని పనితనం బాగుంది. యాక్షన్ సన్నివేశాల పిక్చరైజేషన్ స్టైలిష్ గా ఉంది. ఓవర్ ఆల్ గా... భారీ అంచనాలు పెట్టుకోకుండా, వీకెండ్ లో ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను చూసి ఎంజాయ్ చేయొచ్చు.