అరణ్య మూవీ రివ్యూ... 

post

హీరో రానా 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవగా నటించి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి ముందు కూడా కొన్ని హిందీ సినిమాలలో నటించినా, 'బాహుబలి' ద్వారా వచ్చిన గుర్తింపే అన్నింటికంటే పెద్దది. ఆ కారణంగా ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ రానా కథానాయకుడిగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ సినిమాను నిర్మించింది. తెలుగులో 'అరణ్య'గా, తమిళంలో 'కాదన్‌'గా, హిందీలో 'హాథీ మేరే సాథీ'గా అది రూపుదిద్దుకుంది. గత యేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఉత్తరాదిన కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో హిందీ వెర్షన్ 'హాథీ మేరే సాథీ'ని విడుదల చేయకుండా, తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే ఎరోస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది.
కథ విషయానికి వస్తే... గజేంద్ర భూపతి తనకు చెందిన వందల ఎకరాల భూభాగాన్ని అటవీ ప్రాంతంగా మార్చి ప్రభుత్వానికి అప్పగిస్తాడు. దానిని ధారాదత్తం చేసే అధికారం ప్రభుత్వానికి సైతం లేకుండా వీలునామా రాస్తాడు. గజేంద్ర భూపతి వారసుడైన నరేంద్ర భూపతి (రానా) ఆ భూమిని కాపాడటమే కాకుండా ఆ ప్రాంతంలో లక్షల మొక్కల్ని నాటి... అందమైన వనంగా దానిని దీర్చిదిద్దుతాడు . అంతేకాదు... అందులోని వన్య ప్రాణులను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. అందుకే అతన్ని అక్కడి గిరిజనులంతా అరణ్య అని పిలుస్తుంటారు. అటవీ భూముల అభివృద్ధికి పాటుపడిన అరణ్యను రాష్ట్రపతి 'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్‌ ఇండియా' అవార్డుతో సత్కరిస్తాడు కూడా! విశాఖ పరిసరాల్లోని ఈ చిలకలకోనపై రాష్ట్ర అటవీ శాఖా మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత మహదేవన్) కన్ను పడుతుంది. ఐదువందల ఎకరాల్లో పెద్ద టౌన్ షిప్ కట్టాలని చూస్తాడు. అందుకు అడ్డుగా నిలిచిన అరణ్యను కుయుక్తితో జైలుకు పంపుతాడు. అతనికి సహకరించిన జర్నలిస్ట్ అరుంధతి (శ్రియా పిల్గాంకర్)ని ఉద్యోగం నుండి పీకించేస్తాడు. అడవిలోని కొంత భాగాన్ని ప్రభుత్వ మద్దత్తుతో ఆక్రమించి, 60 కిలోమీటర్ల మేర ఎత్తైన గోడ కట్టిస్తాడు. దాంతో ఆ అడవిలోని ఏనుగులకు నీరు దొరకని పరిస్థితి ఎదురవుతుంది. తన ప్రాణాలకంటే మిన్నగా ప్రేమించే ఏనుగుల కోసం అరణ్య ఏం చేశాడు? రాష్ట్రమంత్రితో చేసిన పోరాటంలో అతను ఎలా పైచేయి సాధించాడు? అన్నది మిగతా కథ.

అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను స్ఫూర్తిగా తీసుకుని తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అక్కడ కూడా అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడినప్పుడు వందేళ్ళ క్రితం అక్కడి బ్రిటీష్ అధికారి భార్య చొరవ చూపింది. అటవీ భూభాగం అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అక్కడ నివసించే వన్య ప్రాణుల రక్షణకు ఎన్నో రకాల చట్టాలను చేయించింది. స్వాతంత్రానంతరం కూడా భారత ప్రభుత్వాలు అక్కడి వన్యప్రాణులను కాపాడేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అందువల్లే ఇప్పుడు అది ప్రపంచంలో పేరెన్నిక గన్న నేషనల్ పార్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులోనూ అరణ్య కూడా అటవీభూమిని కాపాడటం, పర్యావరణ హితానికి కారణమయ్యే ఏనుగుల మనుగడ కోసం పోరాటం చేస్తాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ అరణ్య ఆదర్శం పట్ల గొప్ప గౌరవం కలుగుతుంది. అయితే ఎంపిక చేసుకున్న కథను ఆమోదకర యోగ్యంగా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రభు సాల్మన్ విఫలమయ్యాడు. అతను గతంలో ఎన్నో అర్థవంతమైన చిత్రాలు తీసి, ప్రేక్షకులను మెప్పించాడు. కానీ ఈ కథను ఎంపిక చేసుకోవడంలో చూపిన శ్రద్ధ, దానిని వెండితెరపై ఆవిష్కరించడంలో చూపలేకపోయాడు.

తమ పూర్వికులకు చెందిన అటవీ భూమిని దక్కించుకోవడం కోసం అరణ్య చేసే పోరాటం రకరకాల కారణాలతో చెల్లాచెదురైపోతుంది. అలానే అడవిలో ఉండే నక్సలైట్లు... గిరిజనుల ప్రాణాలు కాపాడటం కోసం పాటుపడతారు తప్పితే, అక్కడి వ్యన ప్రాణుల గోడును పట్టించుకోరు. నిత్యం అడవిలోనే సంచరించే నక్సలైట్లు మూడు నెలల పాటు అరవై కిలోమీటర్ల మేర ఓ కార్పొరేట్ కంపెనీ గోడ నిర్మిస్తుంటే ఏమయ్యారో అర్థమే కాదు. నక్సలైట్ నాయకుడు మారయ్య, అతని చెల్లి మల్లి పాత్రలను అర్థవంతంగా తీర్చిదిద్దటంలో దర్శకుడు తడబడ్డాడు. ఇక సింగా గా విష్ణు విశాల్ పోషించిన పాత్రకు తాడు బొంగరం లేనట్టు అయ్యింది. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఏదో చెప్పబోయి ఏదో చెప్పినట్టయ్యింది. అటవీ భూముల పరిరక్షణ, వన్య ప్రాణులను కాపాడటం అనే అంశంలో అనేకానేక నాటకీయ పరిణామలను చొప్పించడంతో ప్రేక్షకులకు కథ ఎటువైపు పోతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మరీ చిత్రంగా సూక్ష్మగ్రాహక జంతువులైన ఏనుగులు సైతం ఒకానొక సమయంలో అరణ్యను అపార్థం చేసుకుని, అతనిపై కక్ష పెంచుకోవడం దర్శకుడి ఊహ జనిత ఆలోచనలకు పరాకాష్ట. అలానే అరణ్య గురించి అన్నీ తెలిసిన గిరిజనులు సైతం అతనితో వైరానికి దిగడం చిత్రంగా అనిపిస్తుంది. ఇలా చిత్ర విచిత్ర సన్నివేశాలతో రెండు గంటల నలభై నిమిషాల పాటు సాగి సినిమా ముగింపుకు చేరుకుంటుంది.