'లెవన్త్ అవర్' రివ్యూ....   

post

ఉపేంద్ర నంబూరి రాసిన '8 అవర్స్' నవల ఆధారంగా,దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించిన  'లెవన్త్ అవర్' సీరిస్ ను చూస్తే... తెలుగువాళ్ళూ తక్కువేమీ కాదనిపిస్తుంది. పైగా స్టార్ హీరోయిన్ తమన్నా ఇందులో ప్రధాన పాత్ర పోషించడంతో ఈ వెబ్ సీరిస్ పై అందరిలోనూ మరింత ఆసక్తి నెలకొంది. శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'లెవన్త్ అవర్' ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే... అరత్రికా రెడ్డి (తమన్నా) ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ. దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం తండ్రి మధుసూదనరెడ్డి (మధుసూదనరావు) అనారోగ్యం పాలు కావడంతో అధికార పగ్గాలు ఆమె చేతిలోకి వస్తాయి. ఆ గ్రూప్ వివిధ రంగాలకు విస్తరించి ఉంటుంది. అయితే... అడ్వాన్స్డ్ హైబ్రిడ్ న్యూక్లియర్ రియాక్టర్ (ఎహెచ్ ఎన్ ఆర్) టెక్నాలజీపై అరత్రికా రెడ్డి దృష్టి పెడుతుంది. దేశంలోని మారు మూల గ్రామాలకు సైతం క్వాలిటీ పవర్ ను, తక్కువ ధరకు అందించాలన్నది ఆమె కోరిక. కానీ పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీ సిస్టమ్ లోని కొందరు వ్యక్తుల కారణంగా ఆమె అడుగులు ముందుకు పడవు. పైగా లాభాలు తగ్గి అప్పులు పెరిగిపోతాయి. ఇది సమయంలో ఇంపీరియల్ బ్యాంక్ ఛైర్మన్ సుందర్ దాస్ (శ్రీకాంత్ అయ్యంగార్) తమకు బాకీ ఉన్న పది వేల కోట్ల రూపాయాలు వెంటనే చెల్లించాలని, లేదంటే కంపెనీని జప్తు చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఒక రాత్రి... కేవలం ఒకే ఒక్క రాత్రిలో అరత్రికా రెడ్డి... అంత పెద్ద మొత్తాన్ని బ్యాంక్ కు చెల్లించిందా? తన చుట్టూ డేగల్లా కాచుకుని ఉన్న ప్రత్యర్థి కంపెనీల పన్నాగాలకు ఆమె ఎలా చెక్ పెట్టింది? అనేదే ఈ వెబ్ సీరిస్.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో సాగే ఈ వెబ్ సీరిస్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయాలు, సినిమా, క్రీడలతో పాటు కార్పొరేట్ రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. అయితే... మిగిలిన మూడు రంగాలపై ప్రజలు చూపించే ఆసక్తి కార్పొరేట్ రంగంపై చూపించరు. అందుకే వాటికి సంబంధించిన వార్తలు కూడా పేపర్లలో లోపలి పేజీల్లోకి వెళ్ళిపోతాయి. నిజానికి ఈ దేశ రాజకీయాలను, సామాన్య ప్రజల జీవన స్థితిగతులను ఇవాళ శాసిస్తోంది కొన్ని కార్పొరేట్ రంగాలే. వాటికి సంబంధించిన కథే ఇదే. కన్నతండ్రి, తోడబుట్టిన సోదరుడు, మాజీ భర్త, తోటి భాగస్వాములు, నమ్మిన స్నేహితులూ అందరూ మూకుమ్మడిగా తనపై మానసికంగా దాడి చేసినా, ధైర్యంగా వాటిని ఎదుర్కొన్న బిజినెస్ ఉమెన్ కథ ఇది.

నటీనటులు విషయానికి వస్తే... ఇంతవరకూ గ్లామర్ పాత్రలనే ఎక్కువగా పోషించి, మిల్కీ బ్యూటీ అనిపించుకున్న తమన్నా... ఇందులో కార్పొరేట్‌ కంపెనీ సీఈవోగా అద్భుతంగా నటించింది. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇది ఒక రాత్రిలో సాగే కథే అయినా... ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో రెండు మూడు నిమిషాల ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అరత్రికా రెడ్డి బాల్యం నుండి ఇప్పటి వరకూ జరిగిన కీలక సంఘటనలను వాటిల్లో చూపించారు. ఓ కార్పొరేట్ టైకూన్ గానే కాకుండా తండ్రి నిరాదరణకు గురైన బిడ్డగా, భర్తచే వంచింపబడ్డ భార్యగా, కొడుకు కోసం ప్రాణం పెట్టే తల్లిగా... ఆ పాత్ర కనిపిస్తుంది. దాంతో తమన్నా నటనకూ బోలెడంత స్కోప్ లభించింది. ఆయా సందర్భాలకు అనుగుణంగా ఆమె చక్కగా నటించింది. ఆమె తండ్రిగా మధుసూదనరావు, తల్లిగా పవిత్ర లోకేష్, మాజీ భర్తగా వంశీ కృష్ణ నటించారు. అలానే ప్రత్యర్థి కంపెనీ అధినేత తనయుడు రాజవర్థన్ రాథోడ్ పాత్రను శత్రు చేశాడు. ఇప్పటి వరకూ అతన్ని గడ్డంలోనే చూసిన జనాలకు ఓ కొత్త శత్రు ను చూస్తున్నట్టు అనిపిస్తోంది. గతంలో రెండు మూడు సినిమాల్లో నటించిన ప్రియా బెనర్జీ ఇందులో కిల్లర్ నోరా పాత్ర చేసింది. అలానే అరుణ్ ఆదిత్, జయప్రకాశ్, రోషిణి ప్రకాశ్, అభిజిత్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. వీళ్ళందరి నుండి ప్రవీణ్‌ సత్తార్ చక్కటి నటన రాబట్టుకున్నాడు.

నిజం చెప్పాలంటే... తమిళ, తెలుగు భాషల్లో ఇవాళ ఓటీటీలో ఆంథాలజీ అనే కాన్పెస్ట్ బాగా పాపులర్ అయ్యింది. కానీ 'చందమామ కథలు' పేరుతో చాలా యేళ్ళ క్రితమే ప్రవీణ్‌ సత్తారు వెండితెర మీదే అలాంటి ప్రయోగం చేశాడు. సో... ఇక ఇలాంటి వెబ్ సీరిస్ తీయడం అతనికి చాలా సింపుల్. అదే మనకు టేకింగ్ లో కనిపిస్తుంది. నిర్మాత ప్రదీప్, దర్శకుడు ప్రవీణ్ తో కలిసి భీమ్ శ్రీనివాస్ రాసిన మాటలు ఆకట్టు కుంటాయి. కథ మొత్తం సాగేది ఓ స్టార్ హోటల్ లో అయినా.... ముఖేశ్ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. భరత్, సౌరభ్ నేపథ్యం సంగీతం బాగుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే.

ఓవర్ ఆల్ గా చెప్పుకోవాలంటే... మొదటి ఎపిసోడ్ చూడగానే... తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తితో నెక్ట్స్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం. అంత క్యూరియాసిటీని ఇది కలిగించింది. నిజానికి ఆఖరి ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుతున్న వ్యూవర్ కు... మరో సీజన్ లో కానీ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరక్క పోవచ్చు అనే భావన కలుగుతుంది. కానీ డైరెక్టర్ సింపుల్ సొల్యూషన్ తో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఒక రాత్రి అంతా మినిట్ టు మినిట్‌ కొన్ని దేశాలను, వాటిలోని కార్పొరేట్ కంపెనీలను కనెక్ట్ చేస్తూ సాగిన ఈ థ్రిల్లింగ్ బోర్డ్ రూమ్ డ్రామా గ్రాఫ్ ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది. ఇంత భారీ స్థాయిలో తీసిన ఈ వెబ్ సీరిస్ కు మరో సీజన్ ఉన్నా... నష్టం లేదు. అలాంటి ఆలోచన మేకర్స్ చేసి ఉండాల్సింది. ఏదేమైనా... ఇంతవరకూ వచ్చిన తెలుగు వెబ్ సీరిస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న 'లెవన్త్ అవర్'ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది.