99 సాంగ్స్ రివ్యూ.... 

post

ఆస్కార్ విజేత ,సంగీత దర్శకుడు, గాయకుడు తొలిసారి ఓ సినిమాకు కథ రాసి, తనే నిర్మిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉంటాయి . ఆయన నిర్మించిన '99 సాంగ్స్' మూవీ విషయమై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. మరి ప్రేక్షకుల అంచనాలను రెహమాన్ సినిమా అందుకుందో లేదో తెలుసుకుందాం.
జయ్ (ఇహాన్ భట్) కు సంగీతమంటే ప్రాణం. అది జీవితాన్ని నాశనం చేస్తుందని, దాని జోలికి పోవద్దు అని అతని తండ్రి చెప్పినా... ఆయనకు తెలియకుండానే సంగీత సాధన చేస్తాడు జయ్. ఒక్క పాట ప్రపంచాన్ని మార్చేస్తుందని ప్రగాఢంగా నమ్మే జయ్... ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా (రంజిత్ బారోట్) కుమార్తె సోఫియా (ఎడిల్సీ వార్గాస్)తో ప్రేమలో పడతాడు. మూగమ్మాయి అయిన సోఫియాకు తన కోసం పాటలు రాసి, పాడే జయ్ అంటే ప్రేమ. అయితే ఆమె తండ్రి మాత్రం ఓ స్ట్రగులింగ్ మ్యూజీషియన్ కి కూతురును ఇచ్చి పెళ్ళి చేయడానికి ఇష్టపడడు. 'ఒక్క పాట కాదు సమాజాన్ని ప్రభావితం చేయగల వంద పాటలు తయారు చేసుకురమ్మని జయ్ కు ఛాలెంజ్ విసురుతాడు. దానిని స్వీకరించిన జయ్ తన స్నేహితుడు పోలో (టెంజిన్ దల్హా)తో కలిసి షిల్లాంగ్ వెళతాడు. అక్కడ జాజ్ సింగర్ షీలా (లీసారే) పరిచయం కావడంతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మరి జయ్ చేసిన ఛాలెంజ్ ఏమైంది? అసలు అతని తండ్రికి సంగీతమంటే ఎందుకు ద్వేషం? ఒక్క పాటతో ప్రపంచాన్ని మార్చొచ్చు అన్న జయ్ ఆశయం నెరవేరిందా? అన్నదే మిగతా సినిమా.
 ఎ.ఆర్. రెహమాన్ రాసిన కథ అనే సరికీ అందరిలోనూ ఇదో మ్యూజికల్ బేస్డ్ మూవీ అనే భావన కలుగుతుంది. అయితే... ఇందులో అంతకు మించిన కథే ఉంది. కేవలం సంగీతాన్నే కాకుండా, సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న మహిళల పట్ల పురుషులకు ఉండే అసూయ; గతం కారణంగా మనుషులు పడే వేదన; కళాకారుల్లో బలహీనతలు... ఇవన్నీ ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. దాంతో రెహమాన్ నుండి ఆశించిన సంగీతం, తద్వారా హీరో సాధించే విజయం పలచబడిపోయాయి. పైగా ప్రేమికుల మధ్య వచ్చే అపార్థాలు, హీరో ఊహించని విధంగా చిక్కుల్లో పడి, హీరోయిన్ కు దూరమైపోవడం వంటి అంశాలు రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు డీలా పడిపోతారు. నిజానికి మూవీ ప్రారంభం ఆసక్తికరంగానే ఉంది. కొంత సేపటి వరకూ ఓ పాటలా సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత వచ్చిన బలహీనమైన సన్నివేశాల కారణంగా రాగం ఎక్కడో తప్పిపోయిన భావన కలుగుతుంది. ఇది కాదు కదా రెహమాన్ నుండి మనం ఆశించేది అనిపిస్తుంది. ప్రేక్షకుల హృదయాలను కదిలించే రెహమాన్ మార్క్ సూపర్ సాంగ్ ఒక్కటీ ఇందులో లేకపోవడం పెద్ద మైనస్. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైనింగ్ బాగుంది. అలానే తనయ్ సతమ్, జేమ్స్ కౌలీ సినిమాటోగ్రఫీ మూవీ మూడ్ కు తగ్గట్టుగా ఉంది.
 హీరోహీరోయిన్లు ఇహాన్ భట్, ఎడల్సీ వార్గాస్ కు ఇదే తొలి చిత్రం. తెలిసిన ముఖాలంటే మనీషా కొయిరాలా, లీసారే నే! హీరోను మోటివేట్ చేసే రిహబిలేషన్ సెంటర్ నిర్వాహకులురాలి పాత్రలో మనీషా కొయిరాలా, షిల్లాంగ్ రెడ్ మస్కారాలోని జాజ్ సింగర్ గా లీసారే బాగానే చేశారు. హీరో స్నేహితుడు పోలోగా తెన్జిన్ తల్హా చక్కగా నటించాడు. హీరో తర్వాత మళ్ళీ అంత వేరియేషన్స్ ఉన్న పాత్ర అతనిదే. హీరోయిన్ బేసికల్ గా మూగమ్మాయి కాబట్టి అభినయంతోనే ఆకట్టుకోవాల్సిన పరిస్థితి. ఎడల్సీ తెర మీద అందంగా ఉంది కానీ నటనతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓవర్ ఆల్ గా ఆర్టిస్టుల నుండి గొప్ప నటన రాబట్టుకోవడంలో, రెహమాన్ కథను ఆసక్తికరంగా చూపించడంలోనూ దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి సక్సెస్ కాలేదనే చెప్పాలి.