కూటికి గతిలేని కూలీ కోట్లు పన్ను కట్టాలట

post

రోజూ రెక్కలు ముక్కులు చేసుకుని దొరికిన పని చేసుకుంటూ కాలం గడిపే కూలీకి … రూ.2.59 లక్షల పన్ను బకాయి చెల్లించాలంటూ ఆదాయ పన్ను(ఐటీ)శాఖ నుంచి నోటీసులు అందడం సంచలనం కలిగించింది. ఒడిశా లోని నవరంగపూర్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఉమర్‌కోట్‌ సమితి పూజారిబారండి గ్రామానికి చెందిన సోనాధర్‌ గోండ్‌ నిరుపేద. 2013-14 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో వివరణ చూపని నగదు లావాదేవీలకు పన్ను చెల్లించాలంటూ గోండ్‌కు నోటీసులు అందాయి.. బ్యాంకు ఖాతా ద్వారా రూ.1.47 కోట్ల లావాదేవీలు జరిపినట్లు నోటీసులో పేర్కొనడంతో బాధితుడు అవాక్కయ్యారు. వాటిలో పేర్కొన్న బ్యాంకులో తనకు ఖాతానే లేదని గోండ్‌ వాపోయారు. ఏడేళ్ల కిందట తనకు ఉపాధి కల్పించిన ఓ యజమాని ఖాళీ కాగితంపై తన సంతకంతో పాటు, ఆధార్‌ కార్డు, బయోమెట్రిక్‌ వేలిముద్రను తీసుకున్నాడని, అక్కడ ఏమైనా మోసం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ చేపడతామని జయపురం సర్కిల్‌ ఐటీశాఖ అధికారి అశోక్‌దాస్‌ చెప్పారు.