జన్‌ధన్‌ ఖాతాలో కోట్ల రూపాయల జమ

post

రెహానా బానో, సయ్యద్‌ మల్లిక్‌ దంపతులు కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ బీడీ కాలనీలో ఉంటారు. ప్రతి ఒక్కరూ బ్యాంకులో నిల్వ లేని (జీరో బ్యాలెన్సు) ఖాతాను ప్రారంభించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో 2015లో రెహానా పేరిట ఆమె భర్త ఒక ఖాతాను ప్రారంభించారు. ‘మీ భార్య పొదుపు ఖాతాలో రూ.కోట్లలో నగదు డిపాజిట్ అయ్యింది. బ్యాంకు ఖాతాను ఇప్పటివరకు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోలేదు’ అని బ్యాంకు అధికారులు గత డిసెంబరు చివరివారంలో చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఏటీఎంకు వెళ్లి నగదునిల్వ చీటీని తీసుకున్నారు. ఖాతాలో దాదాపు రూ.30 కోట్లు ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వివరాల కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా, వారు ఇవ్వలేదు. ఏదో మోసం జరుగుతోందని గుర్తించి, ఆదాయపన్ను విభాగం అధికారులకు ఫిర్యాదుచేశారు. ఎవరో సంఘ విద్రోహ కార్యకలాపాలకు రెహానా బానో ఖాతాను వాడుకున్నారని తొలుత అనుమానించారు. ఆమెకు డిసెంబరు మూడోవారంలో గుర్తుతెలియని ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. మీరు ఆన్‌లైన్‌లో చీర కొన్నారు.. మీకు లాటరీ వచ్చింది. మీ ఖాతాసంఖ్య చెబితే నగదు బదిలీ చేస్తామని చెప్పడంతో ఆమె వారికి ఖాతా సంఖ్య చెప్పారు. ఆ తర్వాతే ఆమె ఖాతాలోకి మొత్తం రూ.80 కోట్లు బదిలీ అయ్యాయని, తెలియకుండానే కొన్ని నగదు లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రామనగర, కనకపుర, చెన్నపట్టణ విభాగాల్లో 73 మంది వ్యక్తుల ఖాతాలకు రూ.120 కోట్ల నగదు ఇలానే బదిలీ అయ్యిందని గుర్తించారు.