0px

వివాహ భోజనంబు సినిమా రివ్యూ...

1 month ago

సత్య, సందీప్‌ కిషన్‌, ఆర్జవి ప్రధాన పాత్రల్లో నటించిన ' వివాహ భోజనంబు' సినిమా ఈరోజు సోనీ లివ్‌ ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమాను కె.ఎస్‌.శినిష్‌, సందీప్‌ కిషన్‌ నిర్మించగా రామ్‌ అబ్బరాజు తెరకెక్కించారు. ఈ సినిమాలో సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సుబ్బరాయశర్మ, టీఎన్‌ఆర్‌(దివంగత), హర్ష, శివన్నారాయణ, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు నటించారు. ఈ సినిమాకు అన్వీ సంగీతం అందించారు. కథేంటంటే: మహేశ్‌ (సత్య) ఎల్‌ఐసీ ఏజెంట్‌. అతడు పిసినారి. డబ్బులు పొదుపు చేయడానికి ఏమైనా చేస్తాడు. అనుకోకుండా అనిత(ఆర్జవి)అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ విషయాన్ని అనిత తన కుటుంబ సభ్యులకు చెబుతుంది. వారి పెళ్లైన రోజు నుంచే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారు. దీంతో పెళ్లికి వచ్చిన అనిత కుటుంబ సభ్యులందరూ మహేశ్‌ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన మహేశ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బంధువులను పోషించడానికి అతడు ఎలాంటి తిప్పలు పడ్డాడు? చివరకు వాళ్లను ఊరికి పంపాడా? సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాను లాక్‌డౌన్‌ కారణంగా ఒక పిసినారి ఇంట్లో పది, పదిహేను మంది ఉంటే, వారిని పోషించడానికి అతడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపిస్తూ నవ్వులు పంచేలా తెరకెక్కించారు. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ మహేశ్‌ ఇంట్లో ఉండిపోవడం, అక్కడ మహేశ్‌ పడే ఇబ్బందుల ద్వారా దర్శకుడు ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు.ఈ సినిమాలో సందీప్ కిషన్ అంబులెన్స్‌ డ్రైవర్‌ గా కనిపిస్తాడు. అతడి ఎంట్రీ తర్వాత వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఆయన స్థానంలో సప్తగిరి, తాగుబోతు రమేశ్‌లాంటి నటులను ఎంచుకుంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది. పతాక సన్నివేశాలు భావోద్వేగంగా సాగినా అవన్నీ రొటీన్‌గా చాలా సినిమాల్లో చూసినవే. ఓవరాల్‌గా ఓ మంచి కామెడీ మూవీ చూసిన ఫీల్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది. పిసినారి మహేశ్‌ పాత్రలో సత్య నటనను మెచ్చుకోవచ్చు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆయన నవ్వులు పంచారు. అతని స్నేహితుడిగా నటించిన సుదర్శన్‌, మామగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌లు సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా శ్రీకాంత్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా వారు తమ పరిధి మేరకు నటించారు. సందీప్‌ కిషన్‌ పాత్ర ఆకట్టుకోలేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. అన్వీ సంగీతం, మణికందన్‌ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. భాను కథను రామ్‌ అబ్బరాజు చక్కగా తీశారు. ప్రతి సన్నివేశాన్ని నవ్వులు పంచేలా తీర్చిదిద్దారు.