0px

అశ్మీ రివ్యూ..... 

1 month ago

మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గతంలో చాలానే చిత్రాలు వచ్చాయి. అయితే తమకు జరిగిన అన్యాయాలను మౌనంగా భరించే ఓపిక నశించి, తిరుగుబాటు చేసి ప్రతీకారం తీర్చుకున్న నాయికల చిత్రాలకూ తెలుగులో కొదవలేదు. అలాంటి ఓ రివేంజ్ డ్రామానే ‘అశ్మీ’. కన్నడ నటి రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రధారులుగా స్నేహా రాకేశ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదలైంది. కథ గురించి చెప్పుకోవాలంటే చాలా సింపుల్. కాలేజీ స్టూడెంట్ అయిన అశ్మీ (రుషికా రాజ్) ఓ రోజున కిడ్నాప్ అవుతుంది. ఆమెను ఎవరు? ఎందుకు? కిడ్నాప్ చేశారనేది తెలియదు. అయితే. నాలుగేళ్ళు ఓ గదిలో బందీ అయ్యి, అత్యాచారానికీ గురైన అశ్మీ ఎట్టకేలకు అక్కడి నుండి బయటపడుతుంది. ఆమె రాకకోసం ప్రియుడు శివ (రాజా నరేంద్ర) నాలుగేళ్ళుగా ఎదురుచూస్తూ ఉంటాడు. అశ్మీ చేదు జ్ఞాపకాలను మర్చిపోయి. సాధారణ జీవితాన్ని గడపాలని శివ భావిస్తాడు. ఆమె ఆమోదంతో పెళ్ళి కూడా చేసుకుంటాడు. మరి శివ కోరుకున్నట్టు అశ్మీ గతాన్ని మర్చిపోగలిగిందా? నాలుగేళ్ళ పాటు తనను చిత్రహింసకు గురిచేసిన వ్యక్తిని గుర్తించ గలిగిందా? అతను ఎవరో తెలుసుకున్న తర్వాత ఆ నీచుడికి ఎలాంటి శిక్ష విధించిందన్నదే మిగతా కథ. ‘అశ్మీ’ ఉమెన్ సెంట్రిక్ రివేంజ్ డ్రామా. తొలిసారి మెగా ఫోన్ పట్టిన దర్శకుడు శేష్‌ కార్తికేయ. ఎలాంటి ఇంట్రడక్షన్ లేకుండానే డైరెక్ట్ గా అశ్మీ కిడ్నాప్ తో కథను మొదలెట్టేశాడు. అక్కడి నుండి ఆమెను బందీ చేసిన వ్యక్తి ఎలా హింసించాడనే అంశాలను కాస్తంత క్రూరంగానే చూపించాడు. నాలుగేళ్ళు నరకయాతన పడిన అశ్మీ మానసికంగా బలహీనురాలు కాకుండా బయట పడటం ఓ వండర్ అయితే. ఆ తర్వాత ఆమె ఆ గతాన్ని తలుచుకుని పలువురిని అనుమానించడం, మరీ ముఖ్యంగా వాయిస్ అండ్ స్మెల్ ఆధారంగా శివ మెంటర్ అయిన రాజేశ్ మిశ్రా (కేశవ్ దీపక్)ను టార్గెట్ చేయడం మరో వండర్. ఈ క్రమంలో ఆడియెన్స్ ను కన్ ఫ్యూజ్ చేయడానికి దర్శకుడు లాజిక్ లేని సన్నివేశాలను ఎన్నింటినో వండి వార్చాడు. మరీ ముఖ్యంగా కంటికి గంతలు ఉన్నా. రాజేశ్ మిశ్రానే తనని కిడ్నాప్ చేశాడని చెప్పిన అశ్మీ. అతని స్మెల్ విషయంలో ఎలా తప్పటడుగు వేసిందో ఎక్కడా వివరణ ఇవ్వలేదు. అలానే కళ్ళకు ఉన్న గంతలను విప్పుకుని గది గోడలపై రకరకాల బొమ్మలను అశ్మీ ఆ నాలుగేళ్ళలో గీసినా. వాటి గురించి కిడ్నాపర్ కు ఆరా రాకపోవడం మరో వింత. ఇలాంటి లూప్ హోల్స్ ఈ రివేంజ్ థ్రిల్లర్ డ్రామాలో చాలానే ఉన్నాయి. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో హీరోయిన్ తన అండర్ వేర్ తీసి, విలన్ నోటిలో కుక్కడం వంటి పర్వర్టెడ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని భరించడం కాస్త కష్టమే. సినిమా క్లయిమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఒకటి దర్శకుడు పెట్టాడు కానీ అది కూడా ప్రిడిక్టబుల్ గా ఉంది. అశ్మీ రివేంజ్ లో భాగంగా ఓ అమాయకుడిని సైతం మట్టు పెడుతుంది. దీనికి ఎలాంటి రీజన్ దర్శకుడు చూపలేదు! అలానే చాలా ప్రశ్నలకు ముగింపులోనూ మనకు సమాధానం దొరకదు. సినిమా ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. బహుశా దర్శకుడు ఈ సినిమా విజయవంతం అయితే.. దీనికి సీక్వెల్ తీసే ఆలోచనతో అర్థాంతరంగా ముగించి ఉండొచ్చు. కానీ నిర్మాణ విలువలు పెద్దంతగా లేని ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ జనం నుండి దక్కుతుందనేది సందేహమే! నటీనటుల విషయానికి వస్తే గతంలో రెండు మూడు కన్నడ చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించిన రుషికా రాజ్ కు హీరోయిన్ గా ఇదే తొలి తెలుగు సినిమా. కథ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రథమార్థంలో నటనకు పెద్దంత ఆస్కారం లేదు కానీ రివేంజ్ తీసుకునే ద్వితీయార్థంలో రుషికా బాగా చేసింది. ఆమె భర్తగా రాజా నరేంద్ర ఫర్వాలేదనిపిస్తాడు. ఇప్పటికే పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన కేశవ్ దీపక్ ఇందులో కాస్తంత పెద్ద పాత్రనే చేశాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శాండి అద్దంకి నేపథ్య సంగీతం ఓకే. అయితే. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలు, ఆసక్తి రేకెత్తించే సంఘటనలు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాలో లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్!