0px

గోపీచంద్ "సీటీమార్"-థియేటర్లలో తీన్మార్

9 months ago

ముందుగా మా ఈ బ్లాగ్ తరపున మీ అందరికి "వినాయక చవితి శుభాకాంక్షలు".
పండగ,సినిమా !
ఈ రెండు పదాలను ఒకే విధమైన అర్ధంతో చూడగలిగేది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. 
ఎందుకంటే,మనకు సినిమా కూడా ఒక పండగే.
కుదిరితే ప్రతీరోజు జరుపుకునే పండగ. 
అందుకేనేమో,మన తెలుగు సాంస్కృతిక పండగ ఏది ఉన్నా సరే.. 
ఆ రోజు ఒక్క సినిమా అయినా విడుదలకు సిద్ధమవుతోంది. 
పండగ వచ్చిందంటే చాలు,థియేటర్లు కుటుంబాలతో కోలాహలంగా మారిపోతుంటాయి. 
సంక్రాంతి,దసరా లాంటి పెద్ద పండగలు వచ్చినపుడు,ఇక సినిమాల తాకిడి ఎక్కువగ ఉంటుంది.
ఈ ఆధునిక ప్రపంచంలో... 
పోటీలు పడి మరీ పనిలో పరుగులు తీసేరోజుల్లో... 
పండగరోజులు మాత్రమే కుటుంబం అంత కలిసి ఉండేది. 
ఆ కలిసిన రోజున కొద్దీ నిమిషాలు మాత్రమే వినోదాన్ని కోరుకునేది,
అందుకే,పండుగరోజు విడుదలకు నోచుకునే సినిమాకి అంత ప్రాముఖ్యత ఉండేది. 
మాములు రోజుల కంటే వ్యాపారం పరంగా సినిమాకి కలిసొచ్చేది కూడా పండగ రోజులే !
కాకపోతే,ఈ మహమ్మారి కరోనా విజృంభణ వళ్ళ,
గత రెండేళ్లుగా అలాంటి సందడిని,పండుగల వల్లా కలిగే సంబరాలని ఇంచుమించుగా మరిచిపోతూనే ఉన్నాం. 
కానీ,2021 సంవత్సరానా "సినిమా" అనే ఒక మాధ్యమం మనకు ఈ కరోనా కాలం నుంచి కొద్దిగా ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి. 
ఈ సారి పండగల్లో కొద్దిగా వెలితి ఉన్నా,వినాయక చవితి మాత్రం ఎంతో మంది సినిమా ప్రేక్షకులని పండగ తేరుగానే పలకరించింది. 
పండగ-సినిమా అనే ఒక పదాల జంట ఈ సారి సందడి తెచ్చింది.  గోపీచంద్ నటించిన "సీటీమార్" మరియు నాని నటించిన "టక్ జగదీష్" సినిమాలు,
ఈ వినాయక చవితికి,సగటు ప్రేక్షకుడిని పలకరించడానికి భారీ అంచనాలమధ్య విడుదల అయ్యాయి.
కాకపోతే,"టక్ జగదీష్" కొన్ని కారణాల వళ్ళ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్లైన్ మాధ్యమంలో విడుదల కాగా "సీటీమార్" థియేటర్లో విడుదలైంది. 
థియేటర్లో విడుదలైన "సీటీమార్" పై ఒక చిన్న వ్యాసమే ఇది.
ఈ వ్యాసం విశ్లేషణ కాదు,"రివ్యూ" అంతకన్నా కాదు అని ముందుగానే మీకు మేము విస్తరించుకునే మనవి.      "సీటీమార్"..!
గౌతంనంద తరువాత "సంపత్ నంది-గోపీచంద్" కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది.
గత రెండు సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులను దాటుకొని,ఎట్టకేలకు ఈ గణేశుని ఆశీర్వచనంతో పండగరోజున విడుదలైన "కమర్షియల్" సినిమా ఇది.
ఈ సంవత్సరం రవితేజ నటించిన "క్రాక్",పవన్ కళ్యాణ్ నటించిన "వకీల్ సాబ్" సినిమాలు తప్పించి థియేటర్లలో ఒక్క కమర్షియల్ హంగులు లేని సమయాన... 
అతి గొప్పగా,ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమానే ఈ "సీటీమార్". 
అందుకే,హిట్టు-ప్లాపు మాటతో  పనిలేకుండా థియేటర్ కి అదేపనిగా వెళ్ళిపోయి చూస్తున్న సినిమాగా పేరు తెచ్చుకుంది. 
మొదటిరోజే.. 
ఈ నెల విడుదలైన సినిమాలన్నిటిలో గొప్ప ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా కూడా ఇదే. 
నిజానికి,కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ రెండవ విడత తర్వాత... 
భారీ ఓపెనింగ్స్ తో థియేటర్ల బాక్స్ ఆఫీస్ మొత్తం అల్లాడిస్తూనే సినిమా కూడా ఇదే అవ్వటం విశేషం. 
సరైన సినిమా పడిపోవలే కానీ,ఎగబడి వెళ్లిపోయే సినిమా పిచ్చివాళ్ళం మనం అని సీటీ కొట్టి మరీ రుజువు చేస్తున్న సినిమా ఈ "సీటీమార్"   ఇక సినిమా విషయానికి వస్తే,
ఎంత మంచి సినిమాలు చేస్తున్నా... 
ఏదో ఒక లోపం వల్లా గోపీచంద్ సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.   
అభిమానులకి కూడా అసంతృప్తిగా ఉండిపోయింది. 
ఈ సారి ఎలాంటి సందేహం లేకుండా ఈ సినిమాతో రీసౌండ్ వచ్చేలా హిట్టు కొట్టాడు అనే చెప్పుకోవాలి.
చాలా సంవత్సరాలు తరువాత మొదటి రోజునే గోపీచంద్ సినిమాకి అందరిలోనూ పూర్తిగా పాజిటివ్ అభిప్రాయం రావడం విశేషం.     
దీనికి కారణం, అతను ఎంచుకున్న కథతో పాటు అతను కొత్తగా నటించిన విధానం. 
ఎప్పుడూ చూడని ఒక కొత్త సంభాషణల ఒరవడిని ఇందులో చూపించేసారు మన గోపిచంద్. 
ఒక కథ ఎంచుకుంటే అందులో ఉన్న నేపధ్యం కూడా సమాజానికి ఏదో ఒక రకంగా మంచిగా తోర్పడాలి అనే భావంతోనే ఒప్పుకున్నట్లు పరోక్షంగా తెలుస్తుంది.   ఆడపిల్లల కబడ్డీ క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమా అయినప్పటికీ.. 
గోపీచంద్ నుంచి ఉర్రుతలూగించే సంభాషణలు,అరిచి గోల పెట్టాలనిపించే నాలుగు ఫైట్లతో చూడాలి అని ఇష్టపడే మాస్ ప్రేక్షకుల కోసం కమర్షియల్ హంగులు తీసిపోకుండా నిర్మించి తీసిన సినిమా ఇది. 
ఇవి ఉండటంవల్లేనేమో,మొదటి ఆటతోనే అన్ని ప్రదేశాల్లో హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.  వసూళ్లతో సంబంధం లేకుండా, తన పనితనంతో "రచ్చ"  "బెంగాల్ టైగర్" లాంటి సినిమాలతో.. 
మంచి కమర్షియల్ పదును ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న "సంపత్ నంది".. 
ఈ సినిమాతో ఆ పేరుని ఇంకొద్దిగా ఎత్తుకు తీసుకొనివెళ్ళాడు. 
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు ఆడపిల్లల పై సమాజంలో ఉన్న ఒక చిన్నచూపుని ప్రశ్నిస్తూ ఉండేవి నిజంగానే సీటీ వేయాలనిపించేలా ఉన్నాయి.  ఇకపోతే,తమన్నాకి ఒక విభిన్నమైన పాత్రా లభించింది అని మనం ఒప్పుకోవటంలో సందేహమే లేదు. 
తన అభిమాని "ఇరగదీసింది అసలు నటనతో కొత్తగా" అని గర్వపడుతున్నారు. 
తెలంగాణ టీమ్ కబడ్డీ కోచ్ గా కనపడుతూ.. 
తెలంగాణ యాసలో తనే సొంతంగా డబ్బింగ్ చెప్పటంవల్ల పాత్రకి ఒక సహజత్వం ఉంది.   
అందంతోనే కాదు,అభిమానులని తన అభినయంతో కూడా కట్టిపడేయగలదు అని నిరూపంచుకుంది. 
ఇంకో ముఖ్యపాత్ర "దిగంగాన సూర్యవంశీ" రెండవ ముఖ్య నటి కనపడింది. 
అడపా తడపా నిడివి ఉన్నప్పటికీ, తనమేరకు తను అందంలోనూ అభినయంలోనూ ఆ పాత్రకి న్యాయంచేసింది.  ఇక ఈ సినిమాకి ముఖ్యమైన సాంకేతిక నిపుణుల్లో ఇద్దరు ముఖ్యలు. 
ఒకరేమో సంగీత దర్శకుడు ఇంకొకరు ఛాయాగ్రాహకుడు. 
మణిశర్మ సంగీతం అందించంగా,
సౌందరాజన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. 
ఒకరేమో సినిమా పేరుకి తగ్గట్టు సంగీతం అందిస్తే.. 
ఇంకొకరు దర్శకుడి ఆలోచనలని యధావిధిగా తన కెమెరా పనితనం తో బందించి మనకు అద్భుతమైన వినోదాన్ని ఇవ్వటంలో మెప్పు పొందారు. 
నిర్మాత "శ్రీనివాస్ చిట్టూరి" నిర్మాణ విషయంలో ఎలాంటి రాజీపడకుండా ఖర్చుకి వెనకాడకుండా తన ప్రోత్సాహం అందించారు అనేది తెరపై కనపడుతుంది. 
థియేటర్లో సీటీమార్ సినిమా ఆడుతుంటే...సినిమా మధ్యలో వచ్చే పాటలకు నిజంగానే తీన్మార్ వాడేస్తున్నారు అభిమానులు. 
ఓ మంచి కథ,ఓ చక్కని కథనం,మురిపించే పాటలు,అలరించే ఫైట్లు ఇంకేంకావాలి మనకు ఇంతకంటే !
కొన్ని లాజిక్కులు వదిలేస్తే..ఇంకొన్ని అంచనాలను పక్కనపెడితే.. 
ఈ మీ వీకెండ్ కి ఒక మంచి కమర్షియల్ సినిమా ఇది. 
ఇలాంటి ఒక వినోదాత్మక వాతావరణాన్ని చూసి ఎన్ని నెలలు అయ్యిందో అసలు.  నిజానికి... 
సినిమా పరంగానే కాకుండా మన రోజూవారి భయానక వైరస్ లాంటి బారిన పడ్డ వ్యవస్థకి కూడా,ఇదొక మంచి మార్పు.      
పాజిటివ్  నెగిటివ్ టాక్ అని పట్టించుకోకుండా..
వచ్చిన ప్రతీ సినిమాని చూస్తూ... 
"మంచి సినిమా అయితే చాలు ఆదరించి థియేటర్లోనే చూస్తూ ఉండిపోతాం" అని సినిమాని ప్రేమించే ప్రేక్షకుడికి
ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రతీ సినిమాని పండగల జరుపుకుంటారని భవిస్తూ..  
ఇక రాబోయే సినిమాలకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ సీటీ కొట్టి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

తాజా వార్తలు