0px

భారీ అంచనాల మధ్య వచ్చిన "లవ్ స్టోరీ" అలరించిందా..?

9 months ago

కాప్షన్ చూసి ఈ సినిమా హిట్టా ఫట్టా అని తెల్సుకోని సినిమాకి పోదాం అనే వారికోసం మాత్రం ఈ రివ్యూ లాంటి వ్యాసం కానేకాదండోయ్. రివ్యూ తో సంబంధం లేకుండా,ట్రైలర్ లో చూసిన విధంగా రెండు పాత్రల కోసం మాత్రం వెళ్లి వాళ్ళ కథని వీక్షించి వద్దాం అని అనుకునేవారికోసమే ఈ రివ్యూ. ఇంకెందుకు ఆలస్యం,మరి మొదలుపెట్టేద్దాం ఈ లవ్ స్టోరీ యొక్క గమనం చివరికి గెలిచిందో లేదో క్లుప్తంగా తెల్సుకుందాం. ఇంకా మీరు సినిమా చూడలేదు కాబట్టి కథని దాచేస్తూ కథకి ఉపయోగపడిన పాత్రల గురించి వారి నటన గురించి మాత్రమే చెప్తూ వివరించే రివ్యూ ఇది.

సౌమ్యమైన నేపధ్యాలతో పాత్రల చుట్టూ తిరిగే కథలకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకులలో ఒకరు మన శేఖర్ కమ్ముల. ఆనంద్,గోదావరి,లీడర్ లాంటి సినిమాలతో బాగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హ్యాపీడేస్ తో యువతరాన్ని తన వైపు ఐస్కాంతంలా హత్తుకున్నాడు. ఈ "లవ్ స్టోరీ",రెండు సంవత్సరాల ముందు బ్లాక్ బస్టర్ గా పేరు పొందిన సినిమా "ఫిదా" తరువాత విడుదల అవుతున్న సినిమా కాబట్టి అంచనాలు బాగానే ఉంటాయి మరి. "నాగ చైతన్య" రేవంత్ పాత్రలో ఒక సాధారణ పల్లెటూరి అబ్బాయిగా కనిపిస్తాడు.ఇంతకుముందు సినిమాలకంటే భిన్నంగా వేషధారణ ఉంటుంది. ఈ సినిమాలో బతుకుజీవనంకోసం కష్టపడే మధ్యతరగతి యువకులు ఎలా ఉంటారో అలానే లీనమైపోయి మరీ తనని తాను మార్చుకొని ఈ పాత్ర పోషించాడు . ఇక ఫిదా తో తెలుగు సినిమాలో తన మొట్టమొదటి గెలుపుని మరియు అభిమానాన్ని సంపాదించుకున్న "సాయి పల్లవి" ,తన సొంత కాళ్ళ పై సమాజంలో నిలబడాలి అని అత్మాభిమానంతో బ్రతికే అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగే అద్దంలా "మౌనిక పేరు గల పాత్రని పోషించింది. ఎవరికీ వారు జీవితంలో పైకి రావాలని ఎంత కష్టమైన సరే బ్రతుకుతెరువుని మార్చుకోవాలని ప్రయత్నించే క్రమంలో వీరిద్దరికి పరిచేయం ప్రారంభం అవుతుంది. మధ్యలో మీకు ఉత్సాహపరిచే సన్నివేశాలు మరియు మూల కథ తెలీయకుండా అంతా వదిలేస్తే,అనుకోని పరిస్థితుల ప్రభావం వల్ల వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త ఒకరికి ఒకరు ఉండలేనంత బలంగా మారిపోతుంది.వీళిద్దర్హు కలిసి వాళ్ళ జీవితపు లక్ష్యాన్ని కొన్ని అనుకోని అవాంతర సమస్యల నుంచి ఎదురుకొని వాళ్ళ ప్రేమతో పాటు ఎలా గెలిచారు అన్నదే ఈ కథ.

శేఖర్ కమ్ముల సంభాషణల శైలి తెలంగాణ యాసలో ఏదో ఒక పాత్రకి ఉండటం ప్రతి సినిమాలో గమనిస్తూనే ఉంటాం.అయితే ఈ సినిమాలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊరునుంచి మొదలై హైదరాబాద్ నగరం నేపధ్యం కాగా అన్ని పాత్రలకి ఇంచుమించుగా తెలంగాణ యాసతో క్యారెక్టర్ పరిధిని దిద్ది రూపొందించారు.ఇంతకుముందు సినిమాలో కనపడే శేఖర్ కమ్ముల దర్శకత్వ శైలి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలోనూ కనపడుతుంది. మొదటి భాగంలో సాయి పల్లవి దంచులతో అదరగొడితే తనకు సమానంగా ఎన్నడూ లేని విధంగా దంచులతో శభాష్ అనిపించుకున్నాడు మన నాగ చైతన్య. అభిమానుల్లో అమ్మాయిలకు మాత్రం ఈ సినిమా నాగ చైతన్య ఇచ్చే ఒక పెద్ద బహుమతి అని ఒప్పుకోక తప్పదు. మునుపెన్నడూ చూడని ఒక కొత్త నాగ చైతన్యని ఇందులో మాత్రం చూడగలుగుతాం. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలకు నిజంగా ఫిదా అవుతూ లవ్ స్టోరీ అన్న టైటిల్ కి సరిగ్గా సరిపోయారు అని చూస్తూ ఉండాల్సిందే మొదటి భాగమంతా. రిలీజ్ కి ముందు మన సమాజంలో కొన్ని కనపడని సమస్యలు ఉన్నాయని అవి ప్రేమ అనే నేపధ్యంలో చూపించబోతున్నాను అని చెప్పారు శేఖర్ కమ్ముల. తాను చెప్పినట్లుగానే ప్రేమ అనే నేపథ్యంలో కులం అనే రాక్షస మూర్ఖత్వాన్ని, సిటీలో కంటే ఎక్కువ ఊర్లో ఎలా ఉన్నాయో కళ్ళకి కట్టినట్లు చూపించారు. మనుషులను ఒకేలాగా కాకుండా కులం పేరుతో తట్టుకువ చేసి చిన్న చూపు చూసే వాళ్లకి పేదరికం కూడా చాల చులకన అయిపోతుంది అనే భావన ఒక సన్నని దారంలాగా ఈ సినిమాలో చూపించారు మన శేఖర్ కమ్ముల గారు. ఇద్దరు మానుషాల మధ్య ఉన్న ప్రేమకి,రెండు కుటుంబాల మధ్య గొడవలు పెడ్తూ చిన్న చూపు ఎత్తి చూపే కులానికి ముడిపెట్టి చాలా చక్కగా అమర్చారు కథని.

ఇక సాంకేతిక వర్గం పరంగా,విజయ్ సి కుమార్ యొక్క ఛాయాగ్రహణం ఈ కథకి ఒక అందం తెచ్చిపెట్టింది.మొదటి పాటలో వచ్చే కొన్ని డాన్సుల సన్నివేశాలకు ఛాయాగ్రహం ఇంత అందంగా లేకుంటే సాయి పల్లవి ఒక్క నాట్యాన్ని నాగ చైతన్య నుంచి కొత్తదనాన్ని మాత్రం బాగా మిస్ అయ్యేవాళ్ళం.అక్కడక్క గ్రాఫిక్స్ పరంగా కొన్ని ప్యాచ్ లు స్పష్ఠంగా కనపడతాయి. లోపాలు కొని కొన్ని ఉన్నప్పటికీ కథ పరంగా పట్టించుకోనక్కర్లేదేమో అనిపిస్తాయి. పెద్ద తెరపై ఒక సినిమా చూస్తుంటే ఛాయాగ్రహణం మరియు కథ ఎంత ముఖ్యమో వాటికీ ఉన్నపలంగా ప్రాణం పొసే నేపధ్య సంగీతం మరియు పాటలు కూడా అంతే ముఖ్యం. పవన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు కాగా,ప్రతి పాటతో అక్కడ జరిగే సన్నివేశాలకు కథకు మైమరపించే సంగీతం తో నిజంగా ప్రాణం నింపాడు. రాజీవ్ కనకాల,దేవయాని,ఈశ్వరి తమ పాత్రల మేరకు ప్రశంశనీయంగా నటించారు.

కథ ముందుకు చాలా నెమ్మదిగా వెళ్తుంది అని బోర్ ఫీల్ అయ్యే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందో లేదో తెలీదు కానీ,పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా చాల నచ్చుతుంది అని మాత్రం చెప్పగలం.రెండు కామెడీ బిట్లు,నాలుగు ఫైట్ సీన్లు ఉంటాయనుకొని వెళ్తే మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చదు. మిక్స్డ్ రివ్యూలు విభిన్న అభిప్రాయాల మధ్య నలిగిపోయేవారికి ఈ చిన్న విశ్లేషణ ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాం.కథనం విషయంలో కొన్ని లాజిక్కులు మరియు చెప్పాలనుకున్న ముఖ్య సారాంశం కనపడనప్పటికీ ముఖ్య పాత్రధారుల కోసం సినిమాని ఆనందిస్తూ కుటుంబంతో ఒక్కసారి చూడొచ్చు అనే హామీ మాత్రం ఈ రివ్యూ ద్వారా తెలియపర్చుతున్నాము. నిజానికి సూపర్ హిట్ అనే టాక్ రాకపోయినా లేదా వచ్చినా, అంచనాలు మాత్రం సున్నా గా మలిచి వెళ్తే ఈ చిత్రంతో పాటు కథా నేపధ్యం,పాత్రల వైవిధ్యం కూడా మీకు తప్పకుండ నచ్చుతుంది.

తాజా వార్తలు