0px

న్యూజిలాండ్ 296 ఆలౌట్... భారత్ కి 49 పరుగుల ఆధిక్యం

2 months ago

కాన్పూర్ వేదికగా భారత్ ,న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్నా తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. భారత్ స్పిన్ ఉచ్చులో చికుక్కున న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 1 వికెట్లు తీయగా.. పేసర్ ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అక్షర్‌కి ఇది ఐదోసారి.

అంతకుముందు 129 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్ 151 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 89 పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అక్కడి నుంచి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీని కోల్పోయాడు. నిన్నటి ఆటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్లు... ఈరోజు రెండో సెషన్‌లో చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి కివీస్ తడబడింది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18, సీనియర్ రాస్ టేలర్ 11, కైల్ జేమీసన్ 23 పరుగులు చేశారు . రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర (13) అవుటయ్యాడు. అయితే న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ .. ఆరంభంలోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ వికెట్ ను కోల్పోయింది. ఒక పరుగు చేసిన గిల్... జేమ్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా ఉన్నారు.