0px

'ప్రాజెక్ట్ K' లో భాగం కానున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

8 months ago

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ K' అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కనిపించనుంది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం ,అందిస్తుండగా , డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో కొత్త సంగీత దర్శకుడి పేరు వినిపిస్తోంది.

ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో భాగం అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంతోష్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో అందించడంలో పేరు తెచ్చుకున్నాడు. 'కబాలి', 'కాలా' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు ఆయన సంగీతాన్ని విన్నారు. ఇప్పుడు నాని 'దసరా' సినిమాతో టాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి సంగీతం అందించే అవకాశం వచ్చిందని టాక్. 'ప్రాజెక్ట్ కె'కి సంబంధించిన ట్వీట్‌ను సంతోష్ ఇటీవల రీట్వీట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే మిక్కీ జె మేయర్‌కు బదులుగా సంతోష్ నారాయణన్‌ని తీసుకున్నారా? లేక తమిళ వెర్షన్ కోసమే ఆయన్ను తీసుకుంటున్నారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలకు ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ‘సాహో’ సినిమాలోని ప్రతి పాటను ఓ సంగీత దర్శకుడు రూపొందించిన సంగతి తెలిసిందే. 'రాధే శ్యామ్' సౌత్ వెర్షన్‌కి జస్టిన్ ప్రభాకర్, హిందీ వెర్షన్‌కి మిథున్-మానస్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు 'ప్రాజెక్ట్ కె' విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'ప్రాజెక్ట్-కె' ' చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో భారతీయ భాషలతో పాటు అనేక విదేశీ భాషలలో నిర్మించబడుతుంది. స్టార్ కాస్టింగ్ - టాప్ టెక్నీషియన్స్ ఇందులో భాగం కానున్నారు.అందులోను సైన్స్ ఫిక్షన్ & సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కనున్న సూపర్‌హీరో సినిమా ఇది. అందుకే వివిధ భాషల్లోని విభిన్న సంగీత దర్శకులను తీసుకునే అవకాశం ఈ చిత్రానికి ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 'మహానటి' చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్‌ తో పాటు సంతోష్ నారాయణన్ కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత భారీ బడ్జెట్ తో భారతీయ వెండితెరపై 'ప్రాజెక్ట్ కె' విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభాస్ 200 రోజుల కాల్షీట్లను కేటాయించారని టాక్. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పది రోజుల షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. వెండితెరపై కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్న నాగ్ అశ్విన్.. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్ చూసుకుంటున్నాడు. ఒక సంవత్సరం పాటు చిత్రీకరణను నిర్విరామంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.