0px

'పుష్ప' రివ్యూ...

11 months ago

గత సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ తొలిసారిగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండడంతో ఈ సినిమా పై సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి 'తగ్గేదే లే' అంటూ జనాల ముందుకు వచ్చిన 'పుష్ప' ఎలా ఉందొ చూద్దాం ఇప్పుడు.

అడవులను నరికి వేస్తూ అక్కడి వృక్ష సంపద, ఖనిజాలను దోచుకోవడంపై ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి. రచయిత, దర్శకుడు సుకుమార్ 'పుష్ప - ది రైజ్' కోసం విభిన్నమైన కథను రాసుకున్నారు. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం మొక్కలు కొట్టే కూలీగా కెరీర్ ప్రారంభించిన పుష్ప (అల్లు అర్జున్) అనతికాలంలోనే తన ధైర్యం, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో అతడిని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించిన కొండా రెడ్డి (అజయ్ ఘోష్) అతని తమ్ముళ్లకు ఎలా చుక్కలు చూపించాడు? అంతేకాకుండా ఎర్రచందనం సిండికేట్‌ నాయకుడిగా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్‌) కు పక్కలో బల్లెంగా ఎలా మారాడు? చిన్నతనంలోనే ఇంటి పేరు కోల్పోయిన తనను ఆ కారణంగా అవమానించిన వారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే ఇందులో సారాంశం. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో సుకుమార్ ఇటు మదర్ సెంటిమెంట్, అటు లవ్ సెంటిమెంట్ కూడా మిక్స్ చేసాడు. మొదటి నుంచి చివరి వరకు భారీ పోరాట సన్నివేశాలు ఉన్నప్పటికీ మధ్యలో తెరపైకి వచ్చే ఈ ఉద్వేగభరితమైన సంఘటనలు ప్రేక్షకులకు కొంత ఉపశమనం కలిగిస్తాయి.

సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులకు పుష్పరాజ్ తప్ప అల్లు అర్జున్ ప్రేక్షకులకు కనిపించడు. ఎవరి కిందా పని చేయకూడదనుకునే వ్యక్తిగా, తన మాటే నెగ్గాలనే తత్త్వమున్న మొరటోడిగా బన్నీ బాగా చేసాడు. ‘తగ్గేదే లే’ అనే మేనరిజాన్ని ఒక్కో చోటా ఒక్కోలా పలికి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో ఒళ్ళు దాచుకోకుండా కష్టపడ్డాడు. 'రంగస్థలం' సినిమాలో హీరో రామ్ చరణ్‌ని మట్టి మనిషిగా చూపించి సక్సెస్ అయిన సుకుమార్..ఆ సినిమా సక్సెస్ కలిగించిన నమ్మకంతో బన్నీలోని స్టైలిస్ట్‌ని తీసి పక్కకు పెట్టేశాడు. సుకుమార్ నమ్మకాన్ని నిలబెడుతూ బన్నీ పుష్ప పాత్రకు ఐకాన్ అయ్యాడు. మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సన్నివేశంలో చాలా సరదాగా పండించాడు. ఇక క్లైమాక్స్‌లో ‘ఒకటి ఎక్కువుంది’ అంటూ హృదయంలో కసిని వ్యక్తం చేసిన తీరూ అద్భుతంగా ఉంటుంది.పాలు అమ్మే దిగువ మధ్యతరగతి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో రష్మీక ఒదిగి పోయింది.బందీగా ఉన్న తండ్రిని రక్షించుకోవడానికి జాలిరెడ్డి దగ్గరకు వెళ్లే ముందు పుష్ప ను కలిసి, తన ప్రేమను తెలిపే సన్నివేశం సినిమాకే హైలైట్. 'సామీ... నా సామి' పాటలో మాస్ స్టెప్పులు వేసి కుర్రకారు గుండెల్లో వేడి జ్వాలలు రేపింది. పుష్ప కు ఎప్పుడు అడ్డుపడే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో శత్రువు ఆకట్టుకున్నాడు . ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్ ఘోష్, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ బాగా నటించారు.

సునీల్ చేసిన మంగళం శ్రీను పాత్ర ఈ సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ లీడర్‌గా సునీల్ సూపర్‌గా వ్యవహరించాడు. కమెడియన్ గా తనకు ఉన్న ఇమేజ్ ని పూర్తిగా చెరిపేసుకుని కొత్త అవతారం ఎత్తాడు. ఇలాంటి పాత్ర చేయాలని సునీల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. దాన్ని తీర్చుకోవడానికి సుకుమార్ పెద్ద సాహసమే చేశాడనే చెప్పాలి. సునీల్‌లోని కమెడియన్ ఏ కోశానా జనాలకు గుర్తుండదు. మంగళం శ్రీను భార్య దక్ష పాత్రలో అనసూయ నటించింది. ఆమె మేకోవర్ కూడా భిన్నంగా ఉంటుంది. అయితే ‘రంగస్థలం’లో అనసూయ చేసిన పాత్రతో పోలిస్తే ఈ తొలి భాగంలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదు. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన మరో వ్యక్తి సమంత. స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ ఉన్న సమంత కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్ చేసింది. ఆమె శరీరంలోని స్వింగ్ ను బాగా గుర్తించి దానికి తగ్గట్టు కొరియోగ్రఫీని డిజైన్ చేశారు గణేష్ ఆచార్య. సమంత సెంటిమెంట్లను బాగా స్టడీ చేసి ఈ పాటను చంద్రబోస్ రాసినట్లు తెలుస్తోంది! ఈ లిరిక్స్ ఆమె ఇప్పుడు ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మంచి బీట్‌తో కూడిన ఈ పాటను జాగ్రత్తగా చూస్తే మీకు చిన్న బీట్ నొప్పి కూడా కనిపిస్తుంది.

టాలీవుడ్ ప్రేక్షకులు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎందుకంటే మలయాళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసే ఫహద్ ఈ సినిమాలో ఇరగదీస్తాడని నమ్మకం ఉంది. కానీ అంతలేదు! క్లైమాక్స్‌కు కొద్దిసేపటి ముందు భన్వర్ సింగ్ షెకావత్‌గా తెరపైకి వచ్చి కొంత నిరాశపరిచాడు. అయితే ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో ఫహద్ పాతరకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఒకే తండ్రికి పుట్టిన పుష్ప సోదరులు అజయ్‌, శ్రీతేజ్‌లకు సునీల్‌ వెనకుండే 'అరుంధతి' అరవింద్‌ తొలిభాగంలో నటించే అవకాశం రాలేదు. అలాగే రావు రమేష్ నటనను పూర్తిగా చూసే అవకాశం ఇందులో రాలేదు.

ద్వితీయార్థంలో వీరందరికి న్యాయం జరుగుతుందేమో. సాంకేతిక నిపుణుల్లో అగ్రతాంబూలం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ఇవ్వాలి. ఇందులోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ కావడం విశేషం. మిరోస్లా కూడా క్యూబా సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. చంద్రబోస్ అందించిన పాటలు ఇటు సాహితీ కారుల్ని,అటు కుర్రకారుని ఆకట్టుకున్నాయి. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ సినిమాకు మరో హైలైట్. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి. అయితే మూడు గంటల రన్ టైమ్ కాస్త చికాకు కలిగించింది. రెండో భాగం ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ మొదటి భాగాన్ని కాస్త ట్రిమ్చేసి ఉండాల్సింది.దర్శక నిర్మాతలు అలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెరపై చూస్తే అర్ధమవుతుంది. బన్నీ అభిమానులకు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి 'పుష్ప ' సినిమా సూపర్ కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు! ఓవరాల్ గా చూసినప్పుడు మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌కు వచ్చేసరికి సినిమా గ్రాఫ్ కొంచెం డౌన్ అయిందన్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి వస్తుంది . అసలు ఫైర్… రెండవ భాగంలో ఉంటుందని తెలిసినా ఏదో అసంతృప్తి కలుగుతుంది.