0px

పుష్పక విమానం రివ్యూ ...

1 year ago

'దొరసాని'తో విమర్శలెదుర్కొని..'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. దామోదర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఆసక్తికరమైన ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం.

సుందర్ (ఆనంద్ దేవరకొండ) ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే సాధారణ ఉపాధ్యాయుడు. అతను మీనాక్షి (గీతా సైని) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఫస్ట్‌నైట్‌లోనే వీరి మధ్య అనుకోని విభేదాలు వచ్చాయి.దీనితో కొన్ని రోజుల తర్వాత మీనాక్షి తనకిష్టమైన వాడితో వెళ్లిపోతుంది. అక్కడి నుంచి సుందర్ తన భార్య లేచిపోయిన సంగతి కప్పిపుచ్చేందుకు నానా తంటాలు పడుతుంటాడు. అతడీ అవస్థల్లో ఉండగానే మీనాక్షి హత్యకు గురైన సంగతి వెల్లడవుతుంది. దీంతో పోలీసుల చూపు సుందర్ పై పడింది. మీనాక్షి ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం జరిగింది.. ఆమె మర్డర్ మిస్టరీ ఎలా వీడింది.. సుందర్ ఈ కేసు నుంచి బయటపడ్డాడా లేదా అన్నదే మిగతా కథ.

కాసేపటికి తన పెళ్లనగా హీరో కోసం హీరోయిన్ పెళ్లి మండపం నుంచి పారిపోవడం..లేదా పెళ్లయ్యాక భర్తకు హ్యాండిచ్చి వెళ్లిపోవడం లాంటి చాలా సన్నివేశాలు తెరపై చూస్తుంటాం. అలా పెళ్లి వద్దనుకుని హీరో కోసం హీరోయిన్ వచ్చేస్తుంటే సరదాగా.. క్రేజీగా ఉంటుంది. కానీ అమ్మాయి ఇలాపారిపోయి వచ్చేస్తే.. పెళ్లికొడుకు పరిస్థితి ఏంటనే ఆలోచన ఎప్పటికీ ఉండదు. అతని కోణంలో చూస్తే అది మామూలు శిక్ష కాదు. సమాజం ఆ వ్యక్తిని ఎలా చూస్తుంది.. ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందనే ఆలోచనతో రెండు దశాబ్దాల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘చిరునవ్వుతో’ అనే కథను రాసి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు. మళ్లీ ఇన్నేళ్లకు దామోదర్ అనే కొత్త దర్శకుడు 'పుష్పక విమానం'లో ఈ కాన్సెప్ట్‌ని టచ్ చేశాడు. అయితే త్రివిక్రమ్కొంచెం ఫన్ జోడించి చాలా వరకు సీరియస్‌గా ఈ ఇష్యూను డిస్కస్ చేస్తే.. దామోదర్ ఈ పాయింట్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఉపయోగించేలా చూశాడు. అలాగే కాస్త ఉత్కంఠ రేకెత్తించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్‌లో హిలేరియస్ రైడ్‌గా కనిపించిన ‘పుష్ప విమానం’ ఆశించిన నవ్వులు పంచలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా..అలాగని అనుకున్నంతగా థ్రిల్ కూడా చేయలేక రెంటికీ చెడ్డట్లు తయారైంది. ఎగ్జిక్యూషన్‌లో తేడా రావడంతో ‘పుష్పక విమానం’ మామూలు సినిమాగానే మిగిలిపోయింది.

పెళ్లయిన కొద్ది రోజులకే భార్య లేచిపోతే భర్తకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందనే పాయింట్ తో సినిమా తీయాలనేది ఎగ్జైటింగ్ ఐడియా. ఈ పాయింట్‌ని తీసుకోకుండా ఈ సినిమా ట్రైలర్‌ను కట్ చేయడంలో దర్శకుడు దామోదర్ తన బెస్ట్ టాలెంట్ చూపించాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌లో సినిమా ఉండబోతోందని అంచనాలు పెంచేలా ట్రైలర్‌ను కట్‌ చేశాడు. అది చూసి నవ్వులే నవ్వులన్న అంచనాతో సీట్లో కూర్చుంటే.. ట్రైలర్‌లో చూపించిన కొన్ని ఫన్నీ షాట్స్.. డైలాగ్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. భార్య లేచిపోయిన విషయాన్ని కవర్ చేసుకోవడానికి హీరో పడే ఈ కష్టాల చుట్టూ తిరిగే కొన్ని సన్నివేశాలు ఓ మోస్తరు టైంపాస్. ముఖ్యంగా తన ఇంటికొచ్చిన సహోద్యోగుల ముందు.. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ని తీసుకొచ్చి తన భార్య స్థానంలో పెట్టి మేనేజ్ చేసేందుకు ప్రయత్నించే సన్నివేశాలు నవ్విస్తాయి. హీరో భార్యగా నటించే అమ్మాయిగా శాన్వి మేఘన చురుకుదనం వల్ల ఆ సీన్స్ బాగానే పండింది. అయితే ఇంతకుమించి సినిమాలో ఏం జరుగుతుందో చూస్తే.. చాలా నిరాశ చెందక తప్పదు. చాలా స్లోగా సాగే కథనం ఎక్కడా యాక్టివ్‌గా ఉండదు. కథ మొదటి గంటలో కూడా చెప్పుకోదగ్గ ట్విస్ట్ లేదు.కేవలం పాత్రల మధ్య సంభాషణలతో సిట్యుయేషనల్ కామెడీని పండించే ప్రయత్నమే తప్ప.. కథ పరంగా అయితే ఏ కదలిక కనిపించదు. ఇంటర్వెల్ దగ్గర హీరో భార్య హత్యకు గురైనట్లు తెలిసే దగ్గర సినిమా కొత్త మలుపు తిరుగుతుంది.

ఫస్ట్ హాఫ్ దాకా హాస్యభరితమైన సినిమాలా కనిపించిన ‘పుష్పక విమానం’ సెకండాఫ్ నుంచి థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్తుంది. అయితే సెకండ్ హాఫ్ ఈ కొత్త జానర్ కంటే అ ప్పటివరకు చూసిన జానర్ చాలా నయం అనిపించేలా నడుస్తుంది. సినిమా సాగుతున్న తీరుకు ప్రేక్షకులు సర్దుకుపోవడానికి సమయం పడుతుంది. కామెడీలో కొంత ప్రావీణ్యం కనబరిచిన దర్శకుడు.. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రాన్ని నడిపించడంలో తేలిపోయాడు. సాధారణంగా చాలా సినిమాల్లో కనిపించే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో సెకండాఫ్ సాగుతుంది. ఎస్‌ఐగా సునీల్‌ పాత్రతో వినోదం పండించడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఫస్ట్ హాఫ్ లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ చేసిన శాన్వి.. సెకండాఫ్ లో రీ-ఎంట్రీ ఇచ్చి ఓ రెండు సీన్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ సీన్స్‌ తప్ప మిగతావన్నీ చాలా హెవీగా సాగుతాయి. కథ పరంగానే కాదు.. ఎలా చుసిన హీరో హీరోయిన్ల మధ్య ఎక్కడ కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో హీరోయిన్ హత్య విషయంలో ఎలాంటి ఎమోషన్ కలగదు . దానికితోడు ఇన్వెస్టిగేషన్ సీన్లు తేలిపోవడంతో ఓపిగ్గా ఈ హత్య చేసింది ఎవరో తేలాలంటే చివరి వరకు ఆగడం తప్ప ఏమీ చేయలేకపోయారు. హంతకుడు ఎవరన్న ఉత్కంఠను రేకెత్తించేలా స్క్రీన్ ప్లే సెట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే హంతకుడెవరన్నది గెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ముగింపులోకి వచ్చేసరికి మొదట్లో ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘పుష్పక విమానం’ కాన్సెప్ట్ బాగున్నా.. ఆరంభంలో కొన్ని నవ్వులు పండినా.. ఆ తర్వాత ఇటు కామెడీ పండక.. అటు ఉత్కంఠ రేపలేక ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.

ముందుగా ఇలాంటి కథలో నటించేందుకు ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండకు అభినందించాలి. భార్య లేచిపోయిన భర్త పాత్రలో నటించేందుకు యువ హీరోలంతా ముందుకు రారు . సుందర్ పాత్రకు తన శక్తి మేరకు న్యాయం చేశాడు. ఆ పాత్రకు సరిపోయాడు అనిపించాడు. ఆనంద్ నటన ఎబ్బెట్టుగా లేదు . సహజంగా అనిపించింది.కాకపోతే కథలో.. పాత్రల్లో.. సన్నివేశాల్లో బలం ఉంటే తప్ప ఆనంద్‌ తనంతట తానుగా హైలైట్‌ కాలేని బలహీనత మాత్రం తెరపై కనిపిస్తుంది. ఇక్కడే ఆనంద్‌కి తన అన్నయ్యకి మధ్య తేడా తెలుస్తుంది. హీరోయిన్లలో శాన్వి మేఘన ఆకట్టుకుంది. సినిమాలో మేజర్ హైలైట్ అంటే శాన్వి పాత్ర.. ఆమె నటన. శాన్వి పాత్రను మరికొంత పొడిగిస్తే బాగుండు అని అనిపిస్తుంది . ఆమె కనిపించే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ గీతా సైనీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. నరేష్ స్థాయికి తగ్గ పాత్ర పడలేదు. ఆయన కొంతమేర నవ్వించారు. ఎస్‌ఐ పాత్రలో సునీల్ మామూలుగా అనిపించాడు. అతను సినిమాకు ఏమి ప్లస్ కాలేకపోయాడు. కిరీటీ.. గిరి పర్వాలేదు.

‘పుష్ప విమానం’ సాంకేతిక అంశాలు కాస్త మామూలుగానే అనిపిస్తాయి. నలుగురు సంగీత దర్శకులు కలిసి అందించిన పాటలు ఏవీ గుర్తుండిపోయేవి కావు. పాటలు సినిమా మూడ్‌కి తగ్గట్టు లేవు. మార్క్ కె. రాబిన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. జోసెఫ్ ఫోటోగ్రఫీ బాగుంది. విజువల్స్ సినిమా స్టైల్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువల విషయానికొస్తే.. 'మీకు మాత్రమే చెప్తా' తరహాలో చాలా పరిమిత వనరులతో ఈ చిత్రాన్ని తీసేసినట్లున్నారు. షార్ట్ ఫిలిమ్స్ కూడా మంచి క్వాలిటీతో తెరకెక్కుతున్నా ఈ రోజుల్లో ఈ సినిమా నిర్మాణ విలువలుఆశ్చర్యానికి గురి చేస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ దామోదర్ విషయానికి వస్తే.. కాన్సెప్ట్ వరకు ఆయన్ను అభినందించవచ్చు. కానీ మంచి కాన్సెప్ట్‌ని తీయకుని ..దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేసే కథాకథనాలు అతను తీర్చిదిద్దుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల టాలెంట్ చూపించినా.. ఓవరాల్ గా మెప్పించలేకపోయాడు. ఆయన సినిమాని పూర్తిగా కామెడీ సెన్స్‌లో నడిపి ఉంటే బాగుండేది. థ్రిల్లర్ యాంగిల్‌లో కథను తెరకెక్కించాల్సి వచ్చినప్పుడు దర్శకుడు తేలిపోయాడు.