0px

శింబు "ది లూప్" విడుదల తేదీ ఖరారు..!

2 months ago

తమిళ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ "మానాడు". ఈ చిత్రాన్ని తెలుగులో "ది లూప్" పేరుతో విడుదల చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఇందులో కీలక పాత్ర పోషించారు. దీపావళికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే విడుదలైన "ది లూప్" ప్రచార చిత్రాలు - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఇది టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో కూడిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇందులో శింబు ముస్లిం యువకుడిగా కనిపిస్తుండగా.. అతను ఓ ముఖ్యమంత్రిని చంపిన ఘటన మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు.ఈ ఘటనను అడ్డుకునే పోలీసు అధికారిగా ఎస్‌జే సూర్య కనిపించాడు. తమ జీవితాల్లో ఈ టైమ్ లూప్ జరుగుతోందని తెలుసుకున్నశింబు, ఎస్‌జె సూర్య కలిసి ముఖ్యమంత్రిని ఎలా కాపాడుతారు? అసలు సీఎంను శింబు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? టైమ్ లూప్ నుంచి వీరు బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే ''ది లూప్'' సినిమా చూడాల్సిందే. యాక్షన్ సీక్వెన్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శింబు 27 కేజీల బరువు తగ్గి స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడు.

వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ ప్రభు... మరో వైవిధ్యమైన చిత్రం ''ది లూప్'' సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో దర్శకుడు భారతీరాజా - ఎస్‌ఎ చంద్రశేఖర్‌ - ప్రేమ్‌జీ - కరుణాకరన్‌ - మహేంద్రన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఉమేష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ చేసిన 100వ సినిమా ఇది. వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ కమాచి ఈ చిత్రాన్ని నిర్మించారు.

పాన్ ఇండియా స్థాయిలో 'మనాడు' సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టిన హీరో శింబు ఇక్కడ కూడా తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో రూపొందిన పలు హాలీవుడ్ చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న శింబు.. "ది లూప్" సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.